కిరాణా వ్యాపారి మెసేజ్ కు కేటీఆర్ ఫిదా!

తెలంగాణలోని రైతుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ వరాల జ‌ల్లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. అన్న‌దాత‌ల‌ను ఆదుకునేందుకు కేసీఆర్ అనేక వినూత్న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. దేశంలో మొట్ట‌మొద‌టి సారిగా తెలంగాణ‌లోని రైతుల‌కు ఎక‌రాకు రూ.8వేల పంట పెట్టుబ‌డి సాయం అందించేందుకు తెలంగాణ స‌ర్కార్ `రైతుబంధు`ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. 12 వేల కోట్ల వ్య‌యంతో చేప‌ట్టిన ఈ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కం ద్వారా 58ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ధి చేకూర‌నుంది. దాంతోపాటు, తెలంగాణ‌లోని 93 శాతం భూరికార్డుల ప్ర‌క్షాళ‌న చేసి….భూ య‌జ‌మానులంద‌రికీ కొత్త ప‌ట్టాదారు పాసు పుస్త‌కాలు తెలంగాణ స‌ర్కార్ మంజూరు చేసింది. ఈ నేప‌థ్యంలో ఈ ప‌థ‌కానికి త‌మ వంతు సాయమందించేందుకు కొంత‌మంది ముందుకు వ‌చ్చారు. ఈ విష‌యాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం కేటీఆర్ ట్వీట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో రైతుల‌క కోసం `రైతు బంధు పథకం`బుధ‌వారం నాడు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ నేప‌థ్యంలో ఆ ప‌థ‌కంలో తాము కూడా భాగస్వాముల‌మ‌వుతామ‌ని కేటీఆర్ కు కొంత‌మంది ఔత్సాహికులు వాట్సాప్ మెసేజ్ పంపారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ లోని ఉప్పల్ కు చెందిన చిరు కిరాణా వ్యాపారి అనిల్ గారు ‘రైతుబంధు’ పథకానికి రూ.8వేలు విరాళమిస్తానని చెప్పార‌ని, అది త‌న‌కు ఎంతో ఆనందాన్నిచ్చింద‌ని కేటీఆర్ అన్నారు. ఆ మెసేజ్ చూసి తాను పుల‌కించిపోయాన‌ని, ఆయన అంగీకారంతో ఆ నెంబర్, మెస్సేజ్ ను ట్వీట్ చేస్తున్నాన‌ని కేటీఆర్ చెప్పారు. ఉన్న దాంట్లోనే ఎంతోకొంత‌ రైతుల‌కు సాయం చేయాల‌న్న అనిల్ ఉదార‌త‌ను మెచ్చుకుంటూ కేటీఆర్ కృతఙ్ఞతలు తెలిపారు. అదే త‌ర‌హాలో సిరిసిల్ల‌కు చెందిన రాజేంద‌ర్(సెస్) కూతురు అక్షిత త‌న కిడ్డీ బ్యాంకులో దాచుకున్న 30 వేల రూపాయ‌లు రైతుబంధుకు విరాళం ఇస్తాన‌ని ముందుకు రావ‌డం చాలా ఆనందాన్నిచ్చింద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. తైవాన్ నుంచి రామ్ గారు కూడా త‌న వంతు సాయం అందించేందుకు వివ‌రాలు తెల‌పాల‌ని కోరిన మెసేజ్ ను కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం కేటీఆర్ ట్వీట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.