కిర్రాక్ పార్టీకి పోటీ తగిలింది

ఇప్పటి దాకా అందిన వార్తల ప్రకారం నిఖిల్ సినిమా కిర్రాక్ పార్టీకి సరైన పోటీ లేదు. 16న విడుదలయ్యే సినిమాల్లో ఈ సినిమాదే పై చేయి. కానీ ఇప్పుడు మరో సరైన సినిమా బరిలోకి దిగుతోంది. నయనతార నటించిన కర్తవ్యం సినిమాకు అదే రోజు డేట్ ప్రకటించారు. నిజానికి ఇది డబ్బింగ్ సినిమా. దీనికి అంత ప్రాముఖ్యత ఇవ్వనక్కరలేదు. కానీ కర్తవ్యం సినిమా మాతృక ఆరమ్ సినిమాకు తమిళనాట మాంచి పేరు వచ్చింది. మంచి సమీక్షలు వచ్చాయి.

కర్తవ్యం సినిమా ఆఫ్ బీట్ సినిమా లాంటిది. జనాలకు నచ్చిందో ఓ లెవెల్ లో వుంటుంది. తరచు పేపర్లలో కనిపించే సంఘటన చుట్టూ అల్లిన కథతో తయారైన సినిమా ఇది. నయనతార కలెక్టర్ గా కనిపించే ఈ సినిమాలో ఎమోషన్ కొసకూ స్థాయి తగ్గకుండా వుంటుంది. ఈ సినిమాకు తమిళనాట మాంచి అప్లాజ్ వచ్చింది. చాలా అవార్డులు వరించాయి.కిర్రాక్ పార్టీకి వున్న ఏకైక సమస్య దాని జోనర్. కేవలం యూత్ కు పట్టే సబ్జెక్ట్ అది. ఫ్యామిలీలకు పడుతుందా అన్నది సినిమా విడుదలయ్యాక కానీ తెలియదు. పైగా కాలేజీలు, ర్యాగింగ్ లు, ఎన్నికలు ఇప్పటికే చాలా చూసేసారు. అర్జున్ రెడ్డి అయితే మొత్తం ఊడ్చేసింది. అంతకు మించి కిర్రాక్ పార్టీ ఏం చూపిస్తుందన్నదానిపై దాని విజయం ఆధారపడి వుంటుంది.

సినిమాను అమ్మలేదు

ఇదిలా వుంటే కిర్రాక్ పార్టీ సినిమాను ఒక్క సీడెడ్ మినహా మరే ఏరియా కూడా అమ్మలేదు. శాటిలైట్, ఓవర్ సీస్ కొంత, సీడెడ్ కలిసి యాభై శాతం రికవరీ అయింది. ఇంకా కనీసం ఆరేడు కోట్ల వరకు రికవరీ కావాలి. అదేమంత పెద్ద సమస్య కాదన్నది నిర్మాతల ధైర్యం.సినిమాకు సంబంధించి విడుదల వారంలోపుకే వచ్చినా ఇప్పటి దాకా ట్రయిలర్ వదలలేదు. ట్రయిలర్ కట్ విషయంలో ఓ నిర్ణయానికి ఇంకా రాలేదని తెలుస్తోంది. 10న జరిగే ఆడియో ఫంక్షన్ లో వదిలే అవకాశం వుంది.