కేసీఆర్ కంటె జగన్ మహానుభావుడు!

తెలుగు రాష్ట్రాలు రెండూ ఒకే రకం విపత్తులో చిక్కుకుని ఉన్నాయి. కేవలం సామాజిక సంక్షోభం మాత్రమే కాకుండా, ఆర్థికంగా కూడా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నెల ముగిసేసరికి వేతనాల సమస్య కూడా ప్రభుత్వాలకు తప్పదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్- ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి రెండు వేర్వేరు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయంలో ఉద్యోగవర్గాల దృష్టిలో మాత్రం.. కేసీఆర్ కంటె జగన్ మహానుభావుడు అనే కీర్తిని సంపాదించుకున్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి ఏకంగా ఉద్యోగుల జీతాల్లో కోత విధించారు. ప్రజాప్రతినిధులందరికీ యాభై శాతం కోత విధించి.. ఐఏఎస్ స్థాయి వారికి 60 శాతం, సాధారణ ఉద్యోగులకు 50 శాతం చెల్లించేలా రకరకాల కేటగిరీలకు రకరకా పద్ధతులు ప్రకటించారు. మెజారిటీ ఉండే ఉద్యోగుల విషయానికి వస్తే.. అచ్చంగా యాభై శాతం కోత పెట్టడం జరిగింది. దీనిపై ఒకవైపు కేసీఆర్ మీద ఉద్యోగ సంఘాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. న్యాయపరంగా ఈ విషయాన్ని డీల్ చేయడానికి గల అవకాశాలను కూడా వారు పరిశీలిస్తున్నారు.

ఇలాటి సమయంలోనే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి కూడా.. వేతనాలకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మార్చి నెల జీతం మాత్రం రెండు విడతలుగా చెల్లిస్తాం అంటూ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కోత అనేదే లేకుండా జాగ్రత్త తీసుకున్నారు. అన్నిటికంటె గొప్ప విషయం ఏంటంటే.. చట్టసభల ప్రజాప్రతినిధులు అందరికీ పూర్తి జీతాన్ని వాయిదా వేసేశారు. ఇలా ఉద్యోగులకు అనుకూలంగా ఉండేలాగా జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయంలో కేసీఆర్ కంటె జగన్ మహానుభావుడు అని, ఉద్యోగుల గోడు పెట్టుకోని విధంగా వేతనాల విషయంలో నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ తాజా ఉత్తర్వుల్లో రెండో విడత వేతనాలు చెల్లింపు ఎప్పుడు చేసేది చెప్పకపోయినప్పటికీ.. కోత విధించలేదు గనుక.. కాస్త ఆలస్యంగా అయినా సొమ్ములు తప్పకుండా వస్తాయి గనుక ఉద్యోగులు హేపీగా ఉన్నారు.