కోలీవుడ్ డైరెక్టర్ తోనే బన్నీ నెక్స్ట్.. అట్లీ మాత్రం కాదు!

తగ్గేదేలే అంటూ టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.. పుష్ప మూవీతో ఎలాంటి క్రేజ్ దక్కించుకున్నారో అందరికీ తెలిసిందే. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన బన్నీ.. నేషనల్ లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా రావడంతో అందరి దృష్టి ఆయన నెక్స్ట్ సినిమాలపై పడింది. టాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని ఇండస్ట్రీలకు చెందిన సినీ ప్రియులు.. అల్లు అర్జున్ కొత్త చిత్రాలపై అంచనాలు పెట్టుకుంటున్నారు.

ప్రస్తుతం ఆయన పుష్ప సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్ పార్ట్ కు వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని సుక్కూ చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు పుష్ప -2ని తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి.

అయితే ఈ మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీతో బన్నీ వర్క్ చేయనున్నారని ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. కానీ అట్లీ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అల్లు అర్జున్ తన తర్వాత మూవీ మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ తో చేయనున్నారని ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆరు నెలల క్రితం ఇలా టాక్ రాగా.. ఇప్పుడు మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే నెల్సన్ స్కిప్ట్ వినిపించారని, అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది వచ్చిన రజనీ కాంత్ జైలర్ మూవీ భారీ హిట్ అయిన తర్వాత.. హైదరాబాద్ లో అల్లు అర్జున్ ను నెల్సన్ కలిశారట. ఆ సమయంలోనే నెల్సన్ స్టోరీ చెప్పడం.. బన్నీ అంగీకరించడం జరిగినట్లు సమాచారం. అప్పటి నుంచి వీరిద్దరూ ఆ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే నెల్సన్, అల్లు అర్జున్ మూవీ.. యాక్షన్, ఎంటర్టైన్మెంట్ సమపాళ్లలో ఉన్న స్టోరీతో రూపొందనుందని టాక్. మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్‌ తో బ్లాక్‌ బస్టర్ రేసుగుర్రం చిత్రాన్ని నిర్మించిన నల్లమల్లపు బుజ్జి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు వినికిడి. బన్నీ లైనప్ లో పలువురు డైరెక్టర్స్ ఉన్నా.. ఇతర ప్రాజెక్టుల కంటే ముందు నెల్సన్ సినిమా పూర్తి చేయడం ఫిక్స్ అని ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో.