బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ రాకేష్ రోషన్ ఎన్నో భారీ చిత్రాలను నిర్మించాడు… అంతే కాకుండా ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ఆయన తనయుడు హృతిక్ రోషన్ తో రూపొందించిన కోయీ మిల్ గయా… క్రిష్.. క్రిష్ 3 చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే.
హిందీ సినిమా పరిశ్రమలో దిగ్గజ దర్శకుల్లో రాకేష్ రోషన్ ఒకరు అనడంలో సందేహం లేదు. ఏడు పదుల వయసు దాటిన తర్వాత ఈయన క్యాన్సర్ బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆయన క్యాన్సర్ ను జయించేందుకు కష్టపడుతున్నారు. రాకేష్ రోషన్ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటే ఇప్పటి వరకు క్రిష్ 4 సినిమా ప్రారంభం అయ్యేది.
కరోనా ముందు క్రిష్ 4 సినిమా గురించి రాకేష్ రోషన్ ప్రకటించాడు. ఇప్పటి వరకు వచ్చిన క్రిష్ సినిమాలతో పోల్చితే క్రిష్ 4 కచ్చితంగా అంతకు మించి ఉంటుందని ఆయన నమ్మకంగా చెప్పాడు. కానీ ఇంతలోనే క్యాన్సర్ బారిన పడటంతో ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
క్రిష్ 4 ఉండదు అని అంతా భావిస్తున్న తరుణంలో సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఆ సినిమాను చేయాలని హృతిక్ రోషన్ నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను స్వయంగా రాకేష్ రోషన్ కొట్టి పారేశాడు. క్రిష్ 4 మరే దర్శకుడికి అప్పగించలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. తానే ఆ సినిమాను చేయబోతున్నట్లుగా రాకేష్ రోషన్ క్లారిటీ ఇచ్చాడు.
క్యాన్సర్ తో పోరాటం సాగిస్తున్న వారు బతికి బట్ట కడితే గొప్ప విషయం. అలాంటిది రాకేష్ రోషన్ చాలా నమ్మకంగా క్రిష్ 4 ను తానే పూర్తి చేస్తాను అంటూ చెప్పడం చాలా గొప్ప విషయం అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు అంటున్నారు. కనుక వచ్చే ఏడాది క్రిష్ 4 ను మొదలు పెట్టినా ఆశ్చర్యం లేదు.