క్రైమ్ స్టోరీ: అంబులెన్స్ డ్రైవర్ అకృత్యం.. కరోనా రోగిపై అత్యాచారం

కామాతురాణాం న భయం.. న లజ్జ అని ఊరికే అనలేదు మన పెద్దలు.. ఈ అంబులెన్స్ డ్రైవర్ చేసిన అకృత్యం చూస్తూ అది నిజమనిపించక మానదు. కరోనా విలయ తాండవం సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలో జనాలు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎంత తెలిసినవారైనా కనీసం కరచాలనం కూడా చేసుకోకుండా భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ కరోనా రోగులను తీసుకెళ్లే ఈ అంబులెన్స్ డ్రైవర్ కామం ముందు కోవిడ్ కూడా చిన్నదైపోయింది. కరోనా బారిన పడిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కేరళలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

తిరువనంతపురానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పతనంతిట్టలో ఇరువురు మహిళలకు కరోనా సోకింది. వారిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ వచ్చింది. కేరళలోని నిబంధనల ప్రకారం కరోనా రోగులను కచ్చితంగా 108 అంబులెన్స్ లోనే తరలించారు. దీంతో 25 ఏళ్ల నౌఫాల్ అనే వ్యక్తి అంబులెన్స్ తీసుకుని వచ్చాడు. ఇరువురినీ అందులో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తొలుత వారిలో పెద్ద వయసు మహిళను ఆస్పత్రిలో దించాడు. 19 ఏళ్ల బాధితురాలిని మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పి అక్కడ నుంచి నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ అంబులెన్స్ ఆపి అందులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని చెప్పి బెదిరించి, ఆస్పత్రికి తీసుకెళ్లి వదిలేశాడు. ఈ విషయం ఆమె డాక్టర్లకు చెప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వైద్యపరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగిన విషయాన్ని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

కరోనా రోగిని ముట్టుకోవడానికి కూడా భయపడే పరిస్థితుల్లో అతడు ఏకంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడటం విస్తుగొలుపుతోంది. ప్రస్తుతం ఆ డ్రైవర్ ను క్వారంటైన్ లో ఉంచారు. అతడికి కరోనా వచ్చి చావాలని పలువురు శాపనార్థాలు పెడుతున్నారు. కాగా, దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అక్కడక్కడా జరుగుతున్నాయి. గతంలో ఢిల్లీలోని ఓ కరోనా సెంటర్ లో ఇద్దరు వ్యక్తులు ఓ 19 ఏళ్ల యువతిపై ఇదే తరహా అకృత్యానికి పాల్పడ్డారు.