చంద్రభేదం : ఆ బావకోనీతి.. ఈ బావకో నీతి!

ఈ కథనం.. చంద్రబాబునాయుడు గారి బావల గురించి కాదు. పరస్పరం బావ-బావమరుదులైన ఆయన కేబినెట్ లోని ఇద్దరు నాయకుల గురించి. విభజించు పాలించు అనే నీతిని తెల్ల దొర ల నుంచి మన రాజకీయ నాయకులు బాగానే వంట పట్టించుకున్నారు. మామూలుగా అయితే.. కులాల మధ్య, మతాల మధ్య పల్లెల్లో ముఠాల మధ్య ఇలాంటి విభజించు పాలించు నీతిని నాయకులు అవలంబిస్తూ తమ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.

కానీ చంద్రబాబునాయుడు తన కేబినెట్ మంత్రుల మధ్యలో కూడా ఇదే సిద్ధాంతాన్ని అవలంబించేలా కనిపిస్తున్నారంటూ.. రాజకీయ వర్గాల్లో జోకులు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కేబినెట్ లోని మంత్రులు, వియ్యంకులు కూడా అయిన నారాయణ, గంటా శ్రీనివాసరావుల విషయంలో చంద్రబాబు భిన్నమైన నీతిని అవలంబిస్తున్నారని అనుకుంటున్నారు.

ఇంతకూ విషయం విదేశీ టూర్లకు సంబంధించింది. చంద్రబాబునాయుడు పదిరోజుల విదేశీ యాత్ర సాగించి వచ్చిన వెంటనే.. అమరావతిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికార్లతో సమావేశంలో.. ఆయన ఆరాలు తీస్తున్నప్పుడు.. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంకా ఫారిన్ టూర్లోనే ఉన్న సంగతి బయటకు వచ్చింది. దీంతో చంద్రబాబు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రజలకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. మంత్రి నారాయణ కూడా దాదాపు పదిహేను రోజులకు పైగా లండన్ లోనే ఉన్నారు.

24, 25 తేదీల్లో అమరావతి డిజైన్లపై చంద్రబాబు నాయుడు ఫైనలైజ్ చేయడానికి చంద్రబాబునాయుడు అక్కడకు రానున్న నేపథ్యంలో.. దాదాపు రెండు వారాల ముందుగానే నారాయణ అండ్ కో లండన్ కు వెళ్లింది. తొలి రెండు రోజులు నార్మన్ ఫోస్టర్ తో సమావేశాల్లో పాల్గొన్నారు. తర్వాత ఏం చేశారు. చంద్రబాబునాయుడు వచ్చే వరకు వారంతా లండన్ లోనే ఉన్నారు. ఇన్న రోజులు అక్కడే గడిపినప్పటికీ.. చంద్రబాబునాయుడు ఓకే చెప్పగల డిజైను ప్రత్యామ్నాయాలను రూపొందించేలా ఏమీ చేయలేకపోయారు. అసెంబ్లీ డిజైన్లలో క్వర్రీలు చెప్పిన చంద్రబాబు మరో నలభై రోజుల్లోగా మార్పులతో వాటిని పూర్తి చేయాలని సూచించి వచ్చారు.

మరి ఒక మంత్రి గంటా శ్రీనివాసరావు విదేశీ టూర్ లో కాలహరణం చేస్తున్నారన్నట్లుగా, ఏదో సరదాకు విదేశీ యాత్ర వెళ్లినట్టుగా ఇన్నేసి రోజులు విదేశాల్లోనే ఉంటే ఎలా.. అని చంద్రబాబు వ్యాఖ్యానించడం ఏంటో.. స్వయంగా మంత్రి నారాయణే ఆర్కిటెక్టు మరియు డిజైనర్ అయినట్లుగా పదిహేనురోజులకు పైగా బృందమంతా లండన్ లో గడిపితే ఉపేక్షించడం ఏమిటో ఈ ద్వంద్వనీతి చంద్రబాబుకే అర్థం కాగలదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు ఆ బావకో నీతి.. ఈ బావకోనీతి పాటిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.