చిక్కుల్లో జీవిత

గరుడవేగ సినిమా ఓ పక్క జీవిత రాజశేఖర్ జీవితాల్లో వెలుగు నింపింది. దాంతో ఇంకేం లేదు, ఆ ఫ్యామిలీకి కోట్లు వచ్చేస్తున్నాయి అని వార్తలు వచ్చేసాయి. ఇంక రాజకీయాల్లో కూడా కీలకం అయిపోతారని ఊహాగానాలు ప్రారంభమైపోయాయి. కానీ అసలు విషయం వేరుగా వుంది. గరుడవేగ సినిమా చిక్కలు విడుదలతో అంతం అయిపోలేదు. జీవితకు మరిన్ని ఫైనాన్స్ చిక్కులు చుట్టుముడుతున్నాయి.

గరుడవేగ కోసం చేసిన అప్పులు చాలా వరకు అలాగే వున్నాయి. విడుదలకు ముందు రోజు రాత్రి మూడుకోట్ల అప్పుకు కోటి బాకీ తీర్చి, రెండు కోట్లకు ఫ్లాట్ గ్యారంటీ పెట్టి సేల్ డీడ్ రాశారు. దాంతో పాటు వరల్డ్ డిజిటల్, రీమేక్ రైట్లు హామీగా రాసి ఇచ్చినట్లు తెలిసింది.

కానీ ఇదిలా వుంటే, ఇప్పుడు జీవితనే ఒకరికి తెలియకుండా మరొకరికి ఇద్దరికి గరుడవేగ హిందీ డిజిటల్ హక్కులు విక్రయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో గరుడవేగ నిర్మాత వేరే వాళ్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. అంటే ఆ విధంగా ముగ్గురుకి హక్కులు వెళ్లాయి. అసలు హక్కులు ఫైనాన్స్ ఇచ్చిన వారి దగ్గర వున్నాయి.

కొనుక్కున్న వారిలో ఓ వ్యక్తి ఇప్పటికే పేపర్ నోటీస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హక్కుల విషయంలో ముడిపడ్డవారు ముగ్గురు ఓసారి సమావేశమై ఏం చేయాలన్నదానిపై మల్లగుల్లాలు పడినట్లు తెలుస్తోంది. మరో పక్క ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తి కూడా పేపర్ నోటీస్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.