జగన్‌ సారూ.. ఉత్తరాంధ్ర ఉసురు పోసుకోవద్దు.!

ఉత్తరాంధ్రలో చెత్త రాజకీయాల్ని మొదలు పెట్టింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. దేశంలో ఏ రాష్ట్రానికీ మూడు రాజధానులు లేనప్పుడు, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో వున్న రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకు.? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం చేతకాక, ఉత్తరాంధ్ర ప్రజల్లో రాజధాని సెంటిమెంట్‌ని రగుల్చుతోంది. ‘విశాఖలో అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపిటల్‌ని వ్యతిరేకిస్తే.. మా ఉత్తరాంధ్రకి రావొద్దు..’ అని కొందరి చేత వైసీపీ మాట్లాడిస్తోంది.

ఉత్తరాంధ్ర సంస్కృతీ సంప్రదాయాలు తెలిసినవారెవరూ దీన్ని సమర్థించరు. ఉత్తరాంధ్ర ఆలోచనలు వేరు. ఉత్తరాంధ్రలోని ప్రశాంతత వేరు. ఎవరికీ హాని తలపెట్టని నైజం ఉత్తరాంధ్ర ప్రజలది. ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, అక్కడి పరిస్థితులతో మమేకమైపోతారు. హైద్రాబాద్‌ కావొచ్చు, చెన్నయ్‌ కావొచ్చు, బెంగళూరు కావొచ్చు.. దేశంలోని ఇతర నగరాలు కావొచ్చు.. ఉత్తరాంధ్రులు ఎక్కడ వున్నా, ఎక్కడా అశాంతికి, ఆందోళనలకు తావుండదు. దురదృష్టవశాత్తూ ఉత్తరాంధ్రలోనే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయిప్పుడు కపట రాజకీయాల కారణంగా.

నిన్న చంద్రబాబుకి జరిగింది.. రేప్పొద్దున్న ఇంకొకరికి జరగకుండా పోదు. ఎందుకంటే, అక్కడ ఆ స్థాయిలో రాజకీయ చిచ్చుని వైసీపీ రాజేసింది. ఏం.? చంద్రబాబు చిత్తూరు జిల్లాకి వెళితే, అక్కడెందుకు రాయలసీమ సెగని వైసీపీ రెచ్చగొట్టలేకపోయింది.? ఇక్కడ విషయం చాలా క్లియర్‌. ప్రశాంత ఉత్తరాంధ్రలో అలజడిని సృష్టించడం ద్వారా, ఉత్తరాంధ్రకి చెడ్డ పేరు తీసుకురావాలన్నదే అధికార పార్టీ లక్ష్యం.. అన్నది ఉత్తరాంధ్రలో ప్రముఖంగా విన్పిస్తోన్న అభిప్రాయం.

‘విశాఖ అభివృద్ధి చెందిన నగరం.. రాజధానిగా మార్చి.. కొత్తగా చేసే అభివృద్ధి ఏముంది.? విశాఖలోనూ సమస్యలున్నా, ఆ సమస్యల్ని పరిష్కరిస్తే.. దాన్ని రాజధాని కన్నా ఎక్కువ..’ అని ఉత్తరాంధ్ర మేధావులు నినదిస్తున్నారు. కానీ, ఉత్తరాంధ్ర ప్రజల ఆలోచనలతో తమకు సంబంధం లేదన్నట్లే వ్యవహరిస్తోంది అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. దానికి తగ్గట్టుగానే ఉత్తరాంధ్రలో చిత్ర విచిత్రమైన రాజకీయాలకు తెరలేపింది. కర్నూలు లేని, విజయవాడలో లేని, చిత్తూరులో లేని.. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఎక్కడా లేని చెత్త రాజకీయానికి ఉత్తరాంధ్ర వేదికగా మారడాన్ని సగటు ఉత్తరాంధ్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.