జగన్ కొస నెగ్గించగలరా?

మూడువేలపై చిలుకు పాదయాత్ర చేయడం అంటే అంత సులువు కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినా, చంద్రబాబు చేసినా, ఇప్పుడు వైఎస్ జగన్ చేస్తున్నా అది ఓ బృహత్ కార్యక్రమమే. ఎంత కేరవాన్ లు వెనుక వున్నా, రోజుకు పది నుంచి ఇరవై కిలోమీటర్లే తిరిగినా కూడా కష్టమే. దాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే.

అధికార సాధన అంటే అసాధ్యమైన కార్యమైనా చేపట్టక తప్పదు కాబట్టి జగన్ దానిని తలకెత్తుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనను, ఆయన ఆరోగ్యాన్ని గమనిస్తుంటే, కొస నెగ్గించగలరా? అన్న అనుమానం కలుగుతోంది. ఎండ కన్ను ఎరుగకుండా పెరిగిన వ్యక్తి అయితే కాదు జగన్. రాటుకు పోటుకు తట్టుకోగలిగిన వాడే. ఏడాది జైల్లో వుండి వచ్చాడు. గతంలో ఓదార్పుయాత్ర, ఇంకా చాలా యాత్రలు నిర్విరామంగా చేసాడు. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం జగన్ ఆరోగ్యంపై కాస్త ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ప్రారంభించిన ఒకటి రెండు రోజులకే నడుం నొప్పి వచ్చింది. అది మరీ పెద్ద సమస్య కాలేదు. కానీ రాను రాను జగన్ ఫేస్ చూస్తుంటే చాలా విపరీతమైన అలసటకు గురవుతున్నట్లు అర్థం అయిపోతోంది. దానికి తోడు కాళ్లు బొబ్బలు ఎక్కేస్తున్నాయి. ఎంత మెత్తటి జోళ్లు వేసుకున్నా, రాత్రుళ్లు కేర్ తీసుకున్నా, జగన్ అరికాళ్లు బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వేళ్లకు పట్టీలు వేసుకునే నడక సాగిస్తున్నాడు. ఇప్పటికి మూడు వందల కిలోమీటర్ల నడక పూర్తయింది. ఇది జస్ట్ పదో వంతు మాత్రమే. ఇంకా చాలా వుంది. మరి జగన్ ఎలా నెట్టుకు వస్తాడో చూడాలి.

చిత్రమేమిటంటే ఎన్టీఆర్ రోడ్ పక్కన స్నానాలు మన మీడియాకు ముచ్చటయిన చిత్రాలయ్యాయి. వైఎస్ టైమ్ లో కూడా ఒకటీ అరా ఫోటోలు బయటకు వచ్చాయి. చంద్రబాబు యాత్రకు వచ్చిన ఫొటోల కవరేజీ చెప్పనక్కరేలేదు. కానీ ఇలా దెబ్బతిన్న జగన్ అరిపాదాల వైనం మాత్రం మన మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు.