కరోనా వైరస్ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారీ మార్కులు కొట్టేస్తున్నారు. తన గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. కరోనా విషయంలో తన అవగాహన రాహిత్యాన్ని చాటుకుంటూ.. ఆ మహమ్మారి గురించి తేలిగ్గా మాట్లాడుతూ.. తెలుగు పదాల ఉచ్ఛారణలో తడబడుతూ ప్రతిసారీ కామెడీ అయిపోతున్నారు జగన్.
ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారీ ట్రోలర్స్‌కు కావాల్సినంత స్టఫ్ లభిస్తోంది. వాళ్ల కామెడీని తట్టుకోవడం వైకాపా వాళ్లకు చాలా కష్టమైపోతోంది. ఈ నేపథ్యంలో జగన్ ఈసారి రూటు మార్చారు. లైవ్ ప్రెస్ మీట్లు పెట్టి వ్యతిరేకులకు అవకాశం ఎందుకని ఈసారి రికార్డెడ్ వీడియోను రిలీజ్ చేశారు ఏపీ సీఎం.
ఏపీలో ఒక్కసారిగా కరోనా పంజా విసరడం.. ఒక్క రోజులో 43 కరోనా పాజిటివ్ కేసులు బయటపడటం.. పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో జగన్ బుధవారం సాయంత్రం ప్రెస్‌కు ఒక వీడియో రిలీజ్ చేశారు. రికార్డెడ్ వీడియో కావడంతో ఈసారి తప్పులకు, తడబాటుకు అవకాశం లేకపోయింది. జగన్ బాగానే ప్రాక్టీస్ చేసినట్లున్నారు. ఇదిలా ఉంటే.. కరోనా తీవ్రత ఎంత పెరిగినా దాని గురించి జగన్ అంత సీరియస్‌గా ఏమీ మాట్లాడలేదు.
జనాల భయం తగ్గించాలన్న ఉద్దేశమో ఏమో.. కరోనా జ్వరం కంటే కొంచెం తీవ్రత ఎక్కువ ఉన్న జబ్బే అని.. దీని గురించి ఎక్కువ కంగారు పడాల్సిన పని లేదని జగన్ చెప్పారు. ఏపీలో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని.. ఐతే వీరంతా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారే అని జగన్ అన్నారు. ఢిల్లీ సదస్సుకు వెళ్లి వచ్చిన వారందరినీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు జగన్ చెప్పారు.