జగపతిబాబా.. మజాకా!

నాలుగేళ్ల కిందట జగపతి బాబు సినిమా వస్తోందంటే జనాలు అసలు పట్టించుకునేవాళ్లే కాదు. యూట్యూబ్‌లో ఫ్రీగా సినిమా చూసుకునే వీలు కనిపించినా.. వాటికి వ్యూస్ ఉండేవి కావు. కానీ ఇప్పుడు జగపతిబాబు నటిస్తున్న ఓ సినిమా టీజర్‌ను యూట్యూబ్‌లో పెడితే జనాలు విరగబడి చూస్తున్నారు.

ఈ మధ్యే జగపతి బాబు హీరోగా ‘పటేల్ సార్’ అనే సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవం రోజే ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది ఈ చిత్ర బృందం. ఆ టీజర్ ఇప్పుడు ఆన్ లైన్లో హల్ చల్ చేస్తోంది. లాంచ్ చేసిన ఐదో రోజుకే ఈ టీజర్‌ను 20 లక్షల మంది దాకా చూడటం విశేషం. ఈ సినిమా స్థాయికి ఇది చాలా పెద్ద ఫిగరే.

విలన్, క్యారెక్టర్ రోల్స్ లోకి మారాక.. జగపతి ఇమేజ్ ఎంతగా మారిందో చెప్పడానికి ఇది రుజువు. ఒక టైంలో డబ్బుల కోసం హీరోగా పనికి రాని సినిమాలన్నీ చేశాడు జగపతి. ఐతే ‘లెజెండ్’తో కెరీర్ కొత్త టర్న్ తీసుకుున్నాక మళ్లీ హీరో వేషాల జోలికి వెళ్లలేదు. మళ్లీ ఇప్పుడు ‘పటేల్ సార్’తో ఆయన లీడ్ రోల్ చేయడానికి ముందుకొచ్చాడు.

ఈ సినిమా టీజర్‌తోనే జనాల్ని విశేషంగా ఆకర్షించింది. వాసు పరిమి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. టీజర్‌ను రెండు రోజుల్లోనే పూర్తి చేసిన వాసు.. సినిమాను కూడా అదే వేగంతో ముగించాలని చూస్తున్నాడు. ఇంకో మూడు నెలల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందట.