రాజకీయాల్లో పబ్లసిటీ స్టంట్లకి కేరాఫ్ అడ్రస్.. నరేంద్ర మోడీ. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. గుజరాత్ మోడల్ చూపించి, దేశ ప్రజల్ని తనవైపుకు తిప్పుకున్న నరేంద్ర మోడీ, తొలిసారి పార్లమెంటుకి ఎన్నికవుతూనే, ప్రధాని అయ్యారు. దాంతో, దేశ భవిష్యత్తు కొత్త పుంతలు తొక్కుతుందని అంతా భావించారు.
గడచిన ఏడేళ్ళలో నరేంద్ర మోడీ చేసినన్ని పబ్లసిటీ స్టంట్లు బహుశా అంతకు ముందు ఏ ప్రధానీ చేసి వుండరేమో. నిజానికి, కొన్ని సాహసోపేత నిర్ణయాలూ ప్రధానిగా మోడీ తీసుకున్నారు. వాటికి దేశ ప్రజల నుంచి మద్దతు లభించింది. కొన్ని వివాదాస్పద నిర్ణయాల్ని మోడీ సర్కార్ తీసుకున్నా, తప్పనిసరి పరిస్థతుల్లో దేశ ప్రజలు భరించారు. ‘మంచి జరుగుతుంది లే..’ అన్న చిన్న ఆశతోనే పెద్ద నోట్ల రద్దుకి దేశ ప్రజానీకం మద్దతు పలికారు. అదంతా గతం.
ప్రస్తుతంలోకి వస్తే, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత తీవ్రంగా వుంది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ‘ఆల్ ఈజ్ వెల్’ అనుకోవడానికి వీల్లేదు. దేశంలో ప్రతి వ్యక్తీ, తన కుటుంబ సభ్యుల్నో, బంధువుల్నో, స్నేహితుల్నో కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. వ్యాక్సిన్ ఎక్కడా.? అని దేశమంతా ప్రశ్నిస్తోంది. కరోనా వైద్య చికిత్సలో ఉపయోగించే ఆక్సిజన్, మందుల కొరత కనిపిస్తోంది. ఆసుపత్రుల నిండిపోయాయి.. ఆఖరికి కరోనా వైరస్ వచ్చి చనిపోతే, స్మశానాల్లో అంతిమ సంస్కారాలకీ సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంతకీ, ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడ.? ఏం చేస్తున్నారు.?
తెలుగు రాష్ట్రాల మధ్య అంబులెన్సుల విషయమై రగడ చెలరేగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది.? దేశ ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.. మారటోరియం లాంటి ఆలోచనల్ని కేంద్రం ఎందుకు చేయడంలేదు.? ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష ప్రశ్నలు. కానీ, ప్రధాని మోడీ పెదవి విప్పరు. నేనున్నాననే భరోసా దేశ ప్రజలకు ఇవ్వరు. ఒక్కమాటలో చెప్పాలంటే, కరోనా విపత్తు నేపథ్యంలో పాలకులు, ప్రజల్ని గాలికొదిలేశారన్నది నిర్వివాదాంశం.