జర జాగ్రత్త కిట్టూ.. బాణం గట్టిగా గుచ్చేసుకోవచ్చు.!

చాలామంది ఆయన్ని చాలా తక్కువ అంచనా వేశారుగానీ.. వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ విషయమై ముందుగా ఆయన చెప్పిన జోస్యమే ఫలించింది. ‘జర్నలిస్ట్ అంటే ఇలా వుండాలి..’ అంటూ ఆయనగారి మద్దతుదారులు (ఎక్కువగా టీడీపీ మద్దతుదారులే) కాలరెగరేశారు. ‘అరరె, కిరసనాయిలు కిట్టు జోస్యం కూడా ఫలించేస్తోందే..’ అంటూ వైసీపీ శ్రేణులు అవాక్కయిన సందర్భం కూడా ఇదే.

ఈ విషయంలో ఆంధ్రజ్యోతి – ఏబీఎన్ అధినేత రాధాకృష్ణకి హేట్సాఫ్ అనాల్సిందే. ఎందుకంటే, అసలు అలాంటి ప్రయత్నం జరిగే అవకాశమెంత.? అని సీనియర్ జర్నలిస్టులు సైతం వెటకారం చేసిన వేళ, రాధాకృష్ణ జోస్యం ఫలించి, వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీని ప్రకటించేశారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించినప్పటికీ, ఆ విషయాన్ని వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి నమ్మలేకపోయారనుకోండి.. అది వేరే సంగతి. దీన్ని అమాయకత్వం అనాలా.? అతి తెలివి అనాలా.? అన్నది ఇంకో చర్చ.

వైఎస్ షర్మిల మనసులో ఏముంది.? ఆమె ఎందుకు కొత్త పార్టీ పెడుతున్నారు.? అన్నదానికి సంబంధించి రాధాకృష్ణ తనకు తెలిసిన చాలా విషయాల్ని ఇంకోసారి తన మీడియా సాక్షిగా బట్టబయలు చేశారు. ఈసారి ‘కిట్టుకి కొత్త కల వచ్చి వుండొచ్చు..’ అని అనేవారు తక్కువగానే వున్నారు. ఏమో, ఇదీ నిజమేనేమో.. అని వైసీపీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. అంతే మరి, అంత పెద్ద బ్రేకింగ్ ఇచ్చాక రాధాకృష్ణని నమ్మనివారెవరుంటారు.? అదే సమయంలో, ఒక్కసారి చీకట్లో రాయి విసిరితే.. అది వర్కవుట్ అయ్యిందని.. ప్రతిసారీ అలాగే జరుగుతుందా.? అనేవారూ లేకపోలేదు.

ఆ విషయం పక్కన పెడితే, ఇలాంటి విషయాల్లో రాధాకృష్ణ అత్యుత్సాహం ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కొంప ముంచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే రాధాకృష్ణ మరీ పర్సనల్‌గా వెళ్ళపోతున్నారు. అది ఆయనకి అలవాటైన వ్యవహారమే. ఏదో పెద్ద గొడవ జరిగి, వార్తల్లోకెక్కాలనే కక్కుర్తి ఆయన రాతల్లో కనిపిస్తోందన్నది కొందరి ఆరోపణ. షర్మిల విషయంలో రాధాకృష్ణ ఓవరాక్షన్ వెనుక ఈ వ్యూహమే వుందన్నది వారి వాదనగా కనిపిస్తోంది.

అదే నిజమైతే, షర్మిల కారణంగా రాధాకృష్ణ అడ్డంగా బుక్కయ్యే రోజెంతో దూరంలో లేదు. ఎందుకంటే, రాధాకృష్ణపై నిప్పులు చెరగడానికి షర్మిలకి అర సెకెన్ సమయం కూడా అవసరం లేదు. రాధాకృష్ణ చెప్పినట్లు షర్మిల కొత్త పార్టీ ప్రచారం నిజమే అయినా.. అన్నతో చెల్లెలికి విభేదాలన్న విషయాన్ని టీడీపీ శ్రేణులే నమ్మని పరిస్థితి.

Share