టాలీవుడ్ లో రెండంటే రెండు సినిమాలతోనే సత్తా కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ తాజా చిత్రం ‘జాంబీ రెడ్డి’పై ఇటీవల రాజకీయంగా పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. టైటిల్ లో రెడ్డి అనే పేరు ఉండటంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ టీడీపీ, జనసేనలకు చెందిన పలువురు నేతలు సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ విమర్శలన్నింటికీ చెక్ పెడుతూ స్వయంగా ప్రశాంత్ వర్మ… ఓ సుధీర్ఘ వివరణ ఇచ్చేశారు. ఈ సినిమా ఏ వర్గాన్నో, కులాన్నో లక్ష్యంగా చేసుకుని తీస్తున్న సినిమా కాదని, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకునే కథాంశంతో తీస్తున్న సినిమా అని ప్రశాంత్ వర్మ వివరణ ఇచ్చారు. టైటిల్‌ను తప్పుగా అర్థం చేసుకోవద్దని. ఇది ఏ కమ్యూనిటీని తప్పుగా చూపించే సినిమా కాదని.. అందరూ గర్వంగా ఫీలయ్యే సినిమా ఇది అంటూ ప్రశాంత్ తన వివరణో చెప్పుకొచ్చారు.
ప్రశాంత్ వర్మ వివరణ ఇలా సాగింది. ‘‘ఇటీవల మా సినిమా టైటిల్ ‘జాంబీ రెడ్డి’ అని ప్రకటించాం. దానికి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ట్విట్టర్‌లో జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అయ్యింది. టైటిల్ చాలా బాగుందంటూ చాలా కాల్స్, మెసేజ్‌స్ వచ్చాయి. మీమ్స్ కూడా వచ్చాయి. సినిమాకు అది యాప్ట్ టైటిల్. యానిమేషన్ చాలా బాగుందంటున్నారు. దానిపై మూడు నెలలకు పైగానే వర్క్ చేశాం. టీమ్ పడిన కష్టానికి వచ్చిన రిజల్ట్‌తో మేమంతా హ్యాపీగా ఉన్నాం. కొంతమంది మాత్రం టైటిల్‌ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సినిమాలో ఎవరినీ తక్కువ చేసి చూపించడం, ప్రత్యేకించి ఒక కమ్యూనిటీని తక్కువ చేసి చూపించడం ఉండదు. ఇదొక ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్.
ప్రస్తుతం మనం చూస్తున్న కరోనా మహమ్మారి చుట్టూ జరిగే, కర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ. హాలీవుడ్‌లో ఈ రకం ఎపిడెమిక్ ఫిలిమ్స్ చూస్తుంటాం. అక్కడ న్యూయార్క్ లాంటి బ్యాక్‌డ్రాప్‌లో ఆ కథ జరిగినట్లు చూపిస్తుంటారు. నేను కర్నూలును బ్యాక్‌డ్రాప్‌గా ఎంచుకున్నాను. కర్నూలులో ఇలాంటి మహమ్మారి తలెత్తితే, అక్కడి ప్రజలు ఎలా ఫైట్ చేసి, ఈ మహమ్మారిని నిరోధించి, ప్రపంచాన్నంతా కాపాడతారన్నది ఇందులోని ప్రధానాంశం. కర్నూలును కథ ఎంత హైలైట్ చేస్తుందో సినిమా చూస్తే తెలుస్తుంది. దయచేసి టైటిల్‌ను తప్పుగా ఊహించుకోవద్దు. ఏ కులాన్నీ తక్కువచేసి చూపించడం అనేది కచ్చితంగా ఈ సినిమాలో ఉండదు. నా ఫస్ట్ ఫిల్మ్ ‘అ!’కు జాతీయ స్థాయి గుర్తింపు వస్తే, ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నాను. అందరూ గర్వంగా ఫీలవుతారు.” అని ఆయన వివరించారు. స్వయంగా సినిమా డైరెక్టరే ఈ మేర వివరణ ఇవ్వడంతో ఇక ఈ సినిమాపైనా, టైటిల్ పైనా రాజకీయ రచ్చకు ఫుల్ స్టాప్ పడించదన్న వాదనలు వినిపిస్తున్నాయి.