జిల్ జిల్ జిగేల్ రాణి

రంగస్థలం సినిమా మ్యూజిక్ ను రామ్ చరణ్ సినిమాగా కన్నా, సుకుమార్-దేవీశ్రీప్రసాద్ కాంబో గానే చూడాలి. ఎందుకంటే ఆ కాంబినేషన్ మ్యూజిక్ కు అంత క్రేజ్ వుంది. అలాంటిది రంగస్థలం లాంటి 1985కాలం నాటి సినిమాకు ఎలాంటి పాటలు ఇస్తాడు దేవీ అన్నది చాలా ఆసక్తి కలిగించింది. ఇప్పటికి మూడు పాటలు బయటకు వచ్చాయి. ఇప్పుడు టొటల్ జ్యూక్ బాక్స్ ను బయటకు వదిలారు.

టోటల్ ఆల్బమ్ కు ‘ఎంత సక్కంగున్నావె’ అన్నది సూపర్ సాంగ్ అన్నది ఇప్పటికే ప్రూవ్ అయింది. రంగ రంగ రంగస్థలాన అన్నది మాస్ బీట్ నే అయినా అందులో వున్న వేదాంతం కంటెంట్ కారణంగా కాస్త వెనక్కు వెళ్లింది. టీజింగ్ సాంగ్ రంగమ్మా.. మంగమ్మా కూడా మాంచి హిట్ అయి కూర్చుంది.ఇప్పుడు మిగిలిన రెండు పాటల్లో ఒకటి చిన్న బిట్ సాంగ్ లాంటిది. అది సినిమాలో సిట్యువేషన్ తో సరిపోయేది. మిగిలినదే కీలకమైనది. సుక్కూ-దేవీల అయిటమ్ సాంగ్ లు అన్నీ బ్లాక్ బస్టర్లే.

ఈ అయిదో సాంగ్ ఆ అయిటమ్ సాంగ్ నే. 1985నాటి కొబ్బరితోటల అయిటమ్ సాంగ్ రాయించేసాడు సుకుమార్..’జిల్ జిల్ జిగేలు రాణి’ అంటూ. పక్కగా బావలు సయ్యా.. పాట కాలం నాటి సాహిత్యాన్ని మళ్లీ గుర్తు చేసాడు చంద్రబోస్. ఈ పాట కూడా పక్కాగా పల్లెటూరి మైక్ సెట్లలో మోగిపోయేలా తయారుచేసారు. సాంగ్ ఊపు చూస్తుంటే తెరమీద కచ్చితంగా ఆకట్టుకునేలా వుంది.అంతా బాగానే వుంది. కానీ సుకుమార్ ధైర్యం ఏమిటో కానీ, ఆల్బమ్ లో ఒక్క డ్యూయట్ కూడా లేదు. కానీ రంగమ్మా మంగమ్మా టీజింగ్ సాంగ్, జిగేలు రాణి అయిటమ్ సాంగ్, ఎంత సక్కంగున్నావే లాంటి క్లాస్ మ్యాజికల్ సాంగ్ కలిసి ఆల్బమ్ ను టాప్ లో వుంచడం మాత్రం ఖాయం. ఒక్క సరైన డ్యూయట్ కూడా జోడయి వుంటేనా?