పెద్ద నోట్ల రద్దు వంటి విషయాల్లో పారదర్శకత పనికిరాదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. దాని గురించి ముందుగానే సమాచారమిచ్చేస్తే, అందరూ జాగ్రత్తపడిపోతారనీ, తద్వారా పెద్ద నోట్ల రద్దు అనే అతి పెద్ధ ప్రక్రియ తాలూకు లక్ష్యం నీరుగారిపోతుందనీ అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు.
ఇందులో కొంత నిజం వుంది. అదే సమయంలో, కొంత కట్టు కథా వుంది. కేంద్ర ప్రభుత్వం అంత పక్కాగా పెద్ద పాత నోట్ల రద్దు కార్యక్రమం చేపట్టి వుంటే, పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత దేశంలోని నల్లధనం ఏమైపోయినట్టు.? ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే కూడా దేశంలోని ఏ బ్యాంకుల క్యూలైన్లలోనూ కన్పించలేదెందుకు.? బడా వ్యాపారవేత్తలకు అసలు ‘పచ్చ నోటుతో’ సంబంధం లేకుండా కాలమెలా గడిచిపోయింది.? ఇలా సవాలక్ష ప్రశ్నలు తెరపైకొస్తాయి.
సామాన్యుడేమో, ఒకే ఒక్క 2 వేల రూపాయల నోటు కోసం ప్రాణాలకు తెగించి బ్యాంకుల వద్దా, ఏటీఎంల వద్దా పోరాడాల్సి వచ్చింది. నిజమే మరి, పెద్ద పాత నోట్ల రద్దుని అంత పకడ్బందీగా కేంద్రం చేపట్టింది. అయితే, ఇది సామాన్యుడికి మాత్రమే వర్తిస్తుంది. పెద్దలకి వేరే అడ్డదార్లను ముందే తెరిచిపెట్టేశారు. కాబట్టే, శేఖర్‌రెడ్డి లాంటోళ్ళకి బ్యాంకుల నుంచి కాకుండా డైరెక్ట్‌గా పెద్ద కొత్త నోట్లు.. కాదు కాదు, పెద్ద నోట్ల కట్టలు పెద్దయెత్తున చేరిపోయాయి. దొరికినోళ్ళు ఒకరిద్దరు దొంగలుగా తేలారు. మరి దొరకని దొరల సంగతేమిటి.?
నిజానికి, ఇప్పుడు పెద్ద పాత నోట్లను మార్చుకునే వెసులుబాటు లేదు. కానీ, పెద్దయెత్తున పాత నోట్ల చెలామణీ జరుగుతూనే వుంది. లక్షల్లోనో, కోట్లలోనో పాత నోట్లతో ‘ముఠాలు’ పట్టుబడుతున్న తీరు మీడియాలో చూస్తూనే వున్నాం. ‘మార్పిడికి’ అవకాశం లేకపోతే, ఆ ముఠాలు అంత యాక్టివ్‌గా ఎలా వుంటాయి.? ఇవన్నీ చూస్తే, పెద్ద పాత నోట్ల రద్దుకి సంబంధించి తెరవెనుక ఎంత ‘పెద్ద వ్యవహారం’ నడిచిందో, నడుస్తోందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
దేశ ప్రజల్ని రోడ్డుకీడ్చడం, దేశ ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేయడం, నల్ల దొంగల్ని కాపాడటం అనే లక్ష్యాలు తప్ప, కేంద్రం చెబుతున్నట్లుగా దేశ ఆర్థిక వ్యవస్థని ఉద్ధరించేయడానికో, నల్ల దొంగల్ని వెలుగులోకి తీసుకురావడానికో, అవినీతిని అంతమొందించడానికో పెద్ద పాత నోట్ల రద్దు చేపట్టలేదన్నది సుస్పష్టమిక్కడ. ఎనీ డౌట్స్.?