టాలీవుడ్ లో బాలీవుడ్ డిమాండ్ అంతుందా?

టాలీవుడ్ లో బాలీవుడ్ విల‌న్లు కొత్తేం కాదు. గ‌డిచిన ద‌శాబ్ధ కాలంలో విల‌న్ల రూపంలో సౌత్ న‌టులు తెర‌పైకి వ‌స్తున్నారు గానీ…అంత‌కు ముందు అంతా హిందీ న‌టులు తెలుగు హీరోల‌కు విల‌న్లు. మ‌ధ్య‌లో కొత్త‌ద‌నం ప్ర‌య‌త్నించిన మేక‌ర్లు కొన్నాళ్ల పాటు బాలీవుడ్ వైపు చూడ‌కుండా సౌత్ న‌టుల్నే ఎంపిక చేయ‌డం మొద‌లుపెట్టారు. వాళ్ల‌లో వైవిథ్యం తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది.

అలాగే తెలుగు లో మెయిన్ లీడ్స్ చేసిన కొంత మంది న‌టులు విల‌న్ గా ట‌ర్న్ అవ్వ‌డంతో బాలీవుడ్ నుంచి దిగుమ‌తి చేయ‌డం త‌గ్గిపోయింది. అయితే మ‌ళ్లీ ఇప్పుడా పాత స‌న్నివేశం క‌నిపిస్తోంది. తెలుగు సినిమా పాన్ ఇండియా క్రేజ్ చూసి స్టార్లు సైతం తెలుగు సినిమాల్లో చిన్న ఛాన్స్ వ‌చ్చినా మిస్ చేసుకోవ‌డం లేదు. ఈ క్ర‌మంలో హిందీ విల‌న్లు మ‌రింత ఫోక‌స్ అవుతున్నారు. కొత్త కొత్త న‌టులు తెర‌పైకి వ‌స్తున్నారు.

పాన్ ఇండియాలో సినిమా మార్కెట్ చేసుకునేందుకు మేకర్స్ సైతం హిందీ న‌టులైతే ఉత్త‌మం అని అటువైపుగా చూస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన `భగవంత్ కేసరి` లో అర్జున్ రాంపాల్ న‌ట‌న సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఆ పాత్ర‌కు ప‌ర్పెక్ట్ గా సూట‌య్యాడు. ఇక `సైంధ‌వ్` లో న‌వాజుద్దీన్ సిద్దిఖి సైతం విల‌న్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. న‌వాజుద్దీన్ ఎంట్రీతో సినిమా స్థాయి కూడా మారింది.

అలాగే మారుతి-ప్ర‌భాస్ సినిమాలోనూ సంజ‌య్ ద‌త్ విల‌న్ గా న‌టిస్తున్నాడు. `కేజీఎఫ్` తో ద‌త్ ని తెలుగు ప్రేక్ష‌కులు బాగా ఓన్ చేసుకున్నారు. ఇక పిరియాడిక్ చిత్రం `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`లోనూ బాడి డియోల్ విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఔరంగ‌జేబు పాత్ర పోషిస్తున్నాడు. ఎన్టీఆర్ న‌టిస్తోన్న `దేవ‌ర‌`లో సైఫ్ అలీఖాన్ కూడా విల‌న్ గా మెప్పించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే `ఆదిపురుష్` లో రావ‌ణ్ గా ఆక‌ట్టుకున్నాడు సైఫ్.

ఇలా హిందీ నుంచి చాలా మంది స్టార్లు తెలుగులో విల‌న్ పాత్ర‌లు పోషిస్తున్నారు. వాళ్లంద‌ర్ని మేక‌ర్స్ ఏరికోరి మ‌రీ తెస్తున్నారు. దీంతో పారితోషికం విష‌యంలో స‌ద‌రు న‌టులు గ‌ట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండానే ఇక్క‌డా ఛార్జ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.