టీడీపీకి వేరే శతృవు అక్కర్లేదా.?

తెలుగుదేశం పార్టీకి కొత్తగా రాజకీయ శతృవులెవరూ అవసరం లేదు. ఆ పార్టీకి, నిత్యం కొమ్ముకాసే ఓ వర్గం మీడియానే ప్రధాన శతృవుగా వ్యవహరిస్తుంటుంది అప్పుడప్పుడూ.! టీడీపీ నుంచి ఎవర్నన్నా బయటకు పంపాలంటే, ముందుగా చంద్రబాబు ఆశ్రయించేది ఆ మీడియా సంస్థల్నే. ఆ తర్వాత పని అంతా సదరు మీడియా సంస్థలు చూసుకుంటాయి. అందునా, ఓ మీడియా సంస్థ అయితే, చంద్రబాబుకి ఉచిత సలహాలు ఇచ్చేస్తూ, పార్టీని భ్రష్టుపట్టించేస్తుంటుంది.

తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విషయంలో మొదట ‘కూపీ’ లాగింది సదరు మీడియా సంస్థే. ఇక, అక్కడినుంచి రేవంత్‌రెడ్డిని బయటకు పంపేందుకు సదరు సంస్థ చూపుతోన్న అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. ‘టీడీపీని వీడబోను..’ అని రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చినాసరే, సోకాల్డ్‌ టీడీపీ అనుకూల మీడియా సంస్థ మాత్రం ఊరుకోవడంలేదు. ‘చంద్రబాబు విదేశాల నుంచి తిరిగొచ్చేలోపలే రేవంత్‌రెడ్డిపై వేటు పడుతుందట’ అంటూ ప్రచారం షురూ చేసేసింది.

ఇకనేం, ఈ రాద్ధాంతంతో ఒక వేళ టీడీపీలోనే వుండాలనే ఆలోచన రేవంత్‌రెడ్డికి వున్నా.. విరక్తి చెంది, ఆయన పార్టీ మారిపోవాల్సిందే. రేవంత్‌రెడ్డి టీడీపీని వీడితే, ఆ పార్టీకి లాభమా.? నష్టమా.? అంటే, ఖచ్చితంగా ‘నష్టమే’ అని చెప్పక తప్పదు. రాజకీయం సంగతెలా వున్నా, ఓటుకు నోటు కేసుకి సంబంధించి చంద్రబాబుకి ఇది చాలా పెద్ద ఎదురుదెబ్బగా భావించాల్సి వుంటుంది.

కొన్నాళ్ళ క్రితం ఎర్రబెల్లి దయాకర్‌రావు విషయంలోనూ, అంతకుముందు నాగం జనార్ధన్‌రెడ్డి, అంతకన్నా ముందు దేవేందర్‌గౌడ్‌ విషయంలోనూ.. సదరు టీడీపీ అనుకూల మీడియా చేసింది ఇదే. ఆ ‘అతి’ టీడీపీని ఏ స్థాయిలో భ్రష్టుపట్టించేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తమ్మీద, టీడీపీకి వేరే శతృవు అవసరంలేదు.. సమయానుకూలం శతృవుగా వ్యవహరించే సోకాల్డ్‌ టీడీపీ అనుకూల మీడియా వుండనే వుందిగా.!

2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో టీడీపీ మట్టికరిచేసింది.. 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి తెచ్చేయాలని బాబుగారికి ఆ మీడియా సంస్థ ‘తెగ సహకరించేస్తున్నట్టుంది’ కదూ.!