చంద్రబాబుకు కొత్త టెన్షన్ మొదలైంది. ఎన్నిసార్లు ఓటములు ఎదురైనా సరే పార్టీ కోసం పెద్ద తలకాయలతో పోటీపడిన నాయకులు సైతం ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లిపోతుండడంతో చంద్రబాబు తలపట్టుకుంటున్నారు.
ఇప్పటికే సతీశ్ రెడ్డి వైసీపీలో చేరడానికి ముహూర్తం ప్రకటించడం.. మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెమమాన్, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చేరడం.. బాలకృష్ణ దోస్త్ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు వైసీపీలో చేరిక కన్ఫర్మ్ కాగా తాజాగా జమ్మలమడుగుకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సైతం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఈ నెల 13న వైసీపీలో చేరుతున్నారు.
అయితే.. టీడీపీ నుంచి కీలక నేతలు వైసీపీలోకి చేరుతుండడం సాధారణంగా జరుగుతున్న చేరికల్లో భాగం కాదని.. ఇది స్పెషల్ డ్రైవ్ అని వినిపిస్తోంది. ఈ స్పెషల్ డ్రైవ్‌లో మరికొన్ని కీలక వికెట్లూ పడతాయని తెలుస్తోంది.
కడప జిల్లాకు చెందిన సతీశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉంటూ దశాబ్దాలుగా వైఎస్ కుటుంబాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన ఎన్నో ఓటములు ఎదుర్కొన్నారు. అయితే, పార్టీ కూడా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఇదంతా ఎలా ఉన్నా సుదీర్ఘ కాలం తమతో విరోధంగా ఉన్న నాయకుడిని పార్టీలోకి తీసుకోవడం జగన్ వ్యూహం ప్రకారం జరిగిందని తెలుస్తోంది.
సతీశ్ రెడ్డి తరహాలో హార్డ్ కోర్ టీడీపీ నేతలను ఇప్పుడు వైసీపీలోకి చేర్చుకునే ప్రక్రియకు తెరతీశారని వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. వైసీపీలో చేరుతున్న మరో నేత ఒంగోలు జిల్లాకు చెందిన కదిరి బాబూరావు టీడీపీలో కీలక నేత కానప్పటికీ బాలకృష్ణకు అత్యంత సన్నిహిత మిత్రుడు. ఇప్పుడు ఆయన కూడా వైసీపీ బాట పట్టారు.
ఇక డొక్కా మాణిక్య వరప్రసాద్ కాంగ్రెస్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసినప్పటికీ రాష్ట్ర విభజన తరువాత టీడీపీలోకి వచ్చారు. టీడీపీ ఓటమి పాలైనా కొనసాగుతున్న ఆయన ఇటీవల జగన్ మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు అదే జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
రామసుబ్బారెడ్డి కూడా టీడీపీలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కొనసాగారు. తన చిరకాల శత్రువు ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వచ్చినా కూడా టీడీపీలోనే కొనసాగిన రామసుబ్బారెడ్డి ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ తరహా నేతలందరినీ ఏరికోరి తీసుకురావడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారని వినిపిస్తోంది.
వీరి తరువాత మరికొందరు నేతలు కూడా వైసీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ హార్డ్ కోర్ టీడీపీ నేతను కూడా వైసీపీలోకి తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయనటి తెలుస్తోంది. అలాగే విశాఖపట్నంలో ఓ నాయకుడినీ వైసీపీలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్.