టెన్షన్ లేదని నాగ్ అన్నాడు కానీ.

తన కెరీర్లో ఇప్పటిదాకా ‘ఓం నమో వెంకటేశాయ’కు ఉన్నంత టెన్షన్ ఫ్రీగా ఎన్నడూ లేనని అన్నాడు అక్కినేని నాగార్జున. ఈ సినిమా రిజల్ట్ గురించి.. బాక్సాఫీస్ నంబర్ల గురించి తనకు అసలేమాత్రం కంగారు లేదని నాగ్ చెప్పాడు. ఐతే నాగ్ పైగా ఎంత ధీమాగా కనిపించినప్పటికీ.. ఈ సినిమా విషయంలో చాలామందికి టెన్షన్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ రోజుల్లో ప్రేక్షకులు ఒక డివోషనల్ మూవీని ఏమాత్రం ఆదరిస్తారన్నది సందేహమే. ‘అన్నమయ్య’ రోజులు వేరు. అప్పటికి ఆ సినిమా మీద కూడా సందేహాలున్నాయి కానీ.. అది ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ అయింది. ‘శ్రీరామదాసు’ కూడా ఎలాగోలా ఆడేసింది. కానీ ‘షిరిడి సాయి’ రూపంలో నాగ్-రాఘవేంద్రరావులకు పెద్ద షాకే తగిలింది.

‘ఓం నమో వెంకటేశాయ’ విషయానికి వస్తే.. మళ్లీ వేంకటేశ్వరుడు-భక్తుడు-తిరుమల అనగానే జనాలకు ‘కొత్త’ ఆసక్తి అంటూ ఏమీ లేకపోయింది. అన్నమయ్య అంటే మనవాడు అన్న ఫీలింగ్ ఉండేది. కానీ హాథీరాం బాబా ఉత్తరాది వాడు కావడంతో ఎంత వరకు ఓన్ చేసుకున్నారన్న ఒక డౌట్ ఉంది. పైగా అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో.. గట్టి పోటీ మధ్య ‘ఓం నమో వేంకటేశాయ’ రిలీజవుతోంది.

గత వారం విడుదలైన ‘నేను లోకల్’ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంది. నిన్న రిలీజైన ‘సింగం-3’ పాజిటివ్ టాక్‌తో మొదలైంది. మాస్ ప్రేక్షకులు ఆ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఓం నమో వేంకటేశాయ’ ఫలితంపై సందేహాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్లే బుకింగ్స్ డల్‌గా ఉన్నాయి. హాళ్లు పూర్తిగా నిండే పరిస్థితి కనిపించట్లేదు. సినిమాకు టాక్ ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి మున్ముందు కలెక్షన్లు ఉంటాయేమో. మరి ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.