టాలీవుడ్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ ‘ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ‘నాటు నాటు..’ కి ప్రతిష్ఠాత్మక ఆస్కార్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారతదేశం నుంచి డాక్యు సినిమా కేటగిరీలో గునీత్ మోంగ్రా తెరకెక్కించిన ‘ది ఎలిఫేంట్ విస్పరర్స్’ కూడా ఆస్కార్ ను గెలుచుకుంది. కానీ ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ కి ఆస్కార్ వేదిక పై మాట్లాడేందుకు అవకాశం దక్కినా కానీ గునీత్ కి అవకాశం దక్కలేదు. దీని పై తాను చాలా కలత కు గురయ్యానని తెలిపింది.
అయితే తాను ఆస్కార్ వేదిక వరకూ ప్రయాణించడమే ఒక మిరాకిల్ అన్న విషయాన్ని గునీత్ మోంగ్రా తాజాగా వెల్లడించారు. తాను పంపిన ఆ ఒక్క ఇమెయిల్ తన ఫేట్ మార్చిందని చెప్పారు. ఒకే ఒక్క మెయిల్ తో తాను ఆస్కార్ లో ఎలా అడుగుపెట్టిందో గునీత్ మోంగా వివరంగా తెలిపారు. గునీత్ మోంగా ఇటీవల పాపులర్ హిందీ చానెల్లో కపిల్ శర్మ షోలో కనిపించారు. ఈ షోలో బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు వెల్లడించారు. ఆస్కార్-విన్నింగ్ డాక్యుమెంటరీ తో దర్శక నిర్మాత గునీత్ మోంగా భారతదేశంలో అత్యంత పాపులర్ వ్యక్తులలో ఒకరిగా మారారు. ఇటీవల మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు పంపిన ఒక ఇమెయిల్ తో ఆస్కార్ లో తమ చిత్రం ఎలా స్థానాన్ని సంపాదించిందో మోంగా మీడియాకు వెల్లడించారు.
తన తల్లిదండ్రుల మరణం తర్వాత తాను ఢిల్లీ వదిలి సినిమాలు చేయడానికి ముంబైకి వచ్చానని గునీత్ చెప్పారు. “నా దగ్గర డబ్బు లేదు.. పీజీ చేసేదానిని. నాకు వీసా.. నిధులు కావాలి కాబట్టి నేను ప్రభావవంతమైన వ్యక్తులందరికీ ఇమెయిల్ లు రాసేదానిని. రిచర్డ్ బ్రాస్నన్- రతన్ టాటా- ఎయిర్ లైన్ కంపెనీలు సహా చాలా మంది ప్రముఖులకు నేను ఇమెయిల్ లు పంపేదానిని. కాబట్టి ఒకసారి నేను గౌరవనీయులైన శ్రీమతి ప్రతిభా పాటిల్ కి మెయిల్ రాసాను. అట్నుంచి నాకు సమాధానం వచ్చింది.
వెంటనే సహాయకుడు ఫోన్ చేసి నేను ఏం చేయాలనుకుంటున్నాను? అని అడిగారు. “నేను భారతదేశానికి గర్వకారణమయ్యే ఒక సినిమాని ఆస్కార్ కి తీసుకెళ్లాలనుకుంటున్నాను. నా తారాగణం సిబ్బందితో కలిసి మీకు సినిమా చూపించాలనుకుంటున్నాను” అని చెప్పాను. నేను నిధులు టిక్కెట్లు అడగలేదు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ లో స్క్రీనింగ్ నిర్వహించాలని ప్రతిభాజీ మమ్మల్ని కోరారు.
మొత్తం తారాగణం సిబ్బందితో ప్రివ్యూ షోకి వెళ్లాను. ప్రతిభాజీ బడ్జెట్ సెషన్ తో బిజీగా ఉన్నందున సినిమాను చూడలేకపోయారు. కానీ పృథ్వీరాజ్ చౌహాన్ జీ అక్కడ ఉన్నారు. ఆయన నా మాట విని అమెరికాకు వీసాలు- టిక్కెట్లు- బస సహా ప్రతిదానిలో నాకు సహాయం చేశారు. అమెరికా కు చేరుకున్నప్పుడు నేను చేసిన మొదటి పని ఏమిటంటే బెవర్లీ హిల్స్ లోని ఒక భారతీయ రెస్టారెంట్ కి వెళ్లి నా చిత్రం ఆస్కార్ కి నామినేట్ కావడం గురించి ఒక భారతీయ మహిళతో మాట్లాడాను. ఇది మా ప్రయాణంలో మాకు సహాయపడింది… అని తెలిపారు.
గునీత్ మోంగా గురించి..
2023 ఆస్కార్ విజేతలలో ఒకరైన గునీత్ మోంగా అరుదైన ప్రతిభావని. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక పురస్కారం తనలో ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. ది ఎలిఫెంట్ విస్పరర్స్ కాకుండా.. 2019లో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న పీరియడ్ ఫిల్మ్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గాను సుపరిచితురాలు. ఇది ఆరంభం మాత్రమే మునుముందు మరిన్ని ఆస్కార్ లు గెలుచుకుంటానని ఆమె ధీమాను వ్యక్తం చేస్తున్నారు. గునీత్ గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ ఫ్రాంఛైజీకి నిర్మాతగా కొనసాగారు.