డిప్రెషన్లో సుకుమార్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు తీవ్ర శోకంలో ఉన్నాడు. తన తండ్రి చనిపోయినపుడు మినహాయిస్తే సుక్కు ఇంత బాధలో ఉండటం ఇదే తొలిసారి అన్నది సన్నిహితులు చెబుతున్న మాట. అందుక్కారణం తన ఆప్త మిత్రుడు ప్రసాద్ హఠాత్తుగా చనిపోవడమే. కొన్ని రోజుల కిందటే ప్రసాద్ తీవ్రమైన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

ప్రసాద్ డయాబెటిక్ పేషెంట్. బీపీ కూడా ఉంది. ఈ మధ్య టాబ్లెట్లు వాడటంలో కొంత నిర్లక్ష్యంగా ఉన్నారట ప్రసాద్. దీంతో పరిస్థితి అదుపు తప్పి గుండెపోటుకు గురయ్యారు. సుక్కు కాలేజీ రొజుల నుంచి పరిచయం ఉన్న ప్రసాద్.. ఆయన సినీ రంగ ప్రవేశం చేసిన దగ్గర్నుంచి తోడుగా ఉంటున్నాడు. ఇద్దరూ గోదావరి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లే. ప్రసాద్‌ది కాకినాడ.

సుక్కు సినీ దర్శకుడిగా నిలదొక్కుకున్నాక ప్రసాద్ హైదరాబాద్ వచ్చేశారు. అప్పట్నుంచి సుక్కు సినిమాలతో పాటు వ్యక్తిగత వ్యవహారాలు కూడా చూస్తున్నారు. సుక్కు తన ఆర్థిక వ్యవహారాలు పట్టించుకుని చాలా ఏళ్లయిపోయింది. అవన్నీ ప్రసాదే చూసుకుంటున్నారు. సినిమాల విషయంలోనూ ప్రసాద్ ప్లానింగ్ చాలా ఉంటుంది. ఆయన అస్టిస్టెంట్లందరినీ మేనేజ్ చేసేది ప్రసాదే.

ప్రసాద్ లేకుండా సుక్కుకు ఒక్క రోజు కూడా గడవదని అంటున్నారు. ప్రసాద్‌ గత ఏడాదే నిర్మాతగా కూడా మారాడు. ఓ చిన్న సినిమా మొదలుపెట్టాడు. ఆ సినిమా సెట్ చేసింది సుక్కునే అట. తన మిత్రుడిని నిర్మాతగా చూసినందుకు సుక్కు చాలా సంతోషించాడట. ఐతే ఆ సినిమా విడుదల కాకముందే ప్రసాద్ ఇలా హఠాత్తుగా కన్నుమూశాడు. ఆప్తమిత్రుడి హఠాన్మరణంతో సుక్కు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడని సన్నిహితుల సమాచారం.