తండ్రిని స్టార్‌ని చేసిన దర్శకుడు, కొడుకునీ?

బాల.. విక్రమ్ ను స్టార్ గా చేసిన దర్శకుడు. అంత వరకూ ఏవేవో సినిమాలు చేస్తూ వచ్చిన విక్రమ్ ను ‘సేతూ’తో స్టార్ గా చేసిన ఘనత బాలదే. ఆ తర్వాత చియాన్ ను జాతీయ ఉత్తమ నటుడిగా నిలిపిన ‘పితామగన్’ సినిమాకు దర్శకత్వం వహించింది కూడా బాలనే. అయితే.. ఆ తర్వాత విక్రమ్-బాల దర్శకత్వంలో మరే సినిమా రాలేదు. బాల ఇచ్చిన కీ తో విక్రమ్ దూసుకుపోయాడు.. మరోవైపు బాల తనదైన శైలిలో విభిన్నమైన సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.

తన రూటును మార్చి ఇప్పుడు బాల ఒక రీమేక్ సబ్జెక్ట్ ను చేపడుతున్నాడు. బహుశా ఇది కేవలం విక్రమ్ తనయుడిని పెద్ద తెరకు ఇంట్రడ్యూస్ చేయడానికే కాకపోవచ్చు.. ‘అర్జున్ రెడ్డి’ స్క్రిప్ట్ లో సత్తా ఉన్న సబ్జెక్ట్ కాబట్టే బాల ఈ సినిమా తమిళ రీమేక్ ను చేపట్టి ఉండవచ్చు. ఇలాంటి రా సబ్జెక్ట్స్ ను సొంతంగా డీల్ చేయడంలో సత్తా ఉన్న దర్శకుడు బాల.

మరి ఆల్రెడీ చక్కగా చెక్కిన సబ్జెక్ట్ ను ఇంకెలా చెక్కుతాడు.. అనేది ఆసక్తిదాయకమైన అంశం. మార్పు చేర్పులు చేస్తాడా? లేక యథాతథంగా తీస్తాడా? లేక సబ్జెక్ట్ ను మాత్రమే తీసుకుని.. మొత్తంగా తనదైన శైలిలో మార్చేస్తాడా? ప్రధాన పాత్రల చుట్టూ ట్రాజెడీని గుండెలు పిండేసేలా తీయడం.. బాల శైలి.

ప్రత్యేకించి బాల సినిమాల్లో క్లైమాక్స్ లు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ప్రధాన పాత్రల్లో ఏది చచ్చిపోతుంది? అని ఎదురుచూడాల్సి ఉంటుంది సినిమా చూసినంత సేపూ. మరి అర్జున్ రెడ్డి ముగింపు బాల శైలికి భిన్నం. మరి దీన్ని యథాతథంగా తీస్తాడా? మార్చేస్తాడా? విక్రమ్ ను స్టార్ గా మార్చిన బాల .. ఆ హీరో తనయుడిని అంతే స్టార్ గా చేయగలడా?