తగ్గుతున్న గాయాన్ని కెలికిన స్పైడర్

సినిమా ఇప్పటికే డిజాస్టర్. భారీ రేట్లకు కొన్న బయ్యర్లంతా నిలువునా మునిగిపోయారు. అటుఇటుగా 60కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఇలాంటి సినిమాను మరిచిపోవడానికే ప్రయత్నిస్తారు ఎవరైనా. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను మరిచిపోయి చాలా రోజులైంది. ఇలాంటి టైమ్ లో స్పైడర్ నుంచి ఓ పోస్టర్ వచ్చింది.

విడుదలైన మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత కొన్ని రోజులకే ఫైనల్ రన్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఎక్కడా ఆడడం లేదు. ఇలాంటి టైమ్ లో స్పైడర్ సక్సెస్ ఫుల్ గా 50రోజులు పూర్తిచేసుకుందంటూ నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో అవాక్కవ్వడం ఆడియన్స్ వంతయింది.

స్పైడర్ గాయాన్ని మరిచిపోయేందుకు వెంటనే కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయాడు మహేష్. అటు దర్శకుడు మురుగదాస్ కూడా విజయ్ తో చేయాల్సిన సినిమా పనుల్లో మునిగిపోయాడు. ఇలా అంతా ఆ డిజాస్టర్ ను మరిచిపోదామని ట్రై చేస్తున్న టైమ్ లో 50-డేస్ పోస్టర్ రిలీజ్ చేసి పాత గాయాన్ని మళ్లీ రేపారు నిర్మాతలు.

మరోవైపు ఈ సినిమాను కొన్ని జీ తెలుగు ఛానెల్ కూడా తలపట్టుకుంది. ఏకంగా పాతిక కోట్ల రూపాయలు పెట్టి కొన్న ఈ సినిమాను ఎలా సేల్ చేయాలో అర్థం కావడం లేదు ఆ ఛానెల్ కు. కనీసం టీవీలో అయినా ఈ సినిమాకు మంచి రేటింగ్ వస్తే అటు మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఇటు ఛానెల్ వాళ్లు కూడా హ్యాపీ.