సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కబోతుంది. ఇప్పటికే సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. తాజాగా ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ వరకు సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆ తర్వాత వెంటనే త్రివిక్రమ్ సినిమాకు క్లాప్ కొట్టబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
సినీ వర్గాలు మరియు మహేష్ బాబు సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ మూవీ కోసం 75 రోజుల పాటు మహేష్ బాబు వర్క్ చేయబోతున్నాడట. కంటిన్యూస్ గా 75 డేస్ వర్క్ తో త్రివిక్రమ్ మూవీని మహేష్ ముగిస్తాడని అంటున్నారు. అక్టోబర్ లో సినిమాను పట్టాలెక్కించి వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే లో సినిమా ను సమ్మర్ కానుకగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే వెంటనే జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో సినిమాను మహేష్ బాబు చేయాల్సి ఉంది. అందుకే వచ్చే ఏడాది సంక్రాంతికి సర్కారు వారి పాట.. వెంటనే సమ్మర్ లో త్రివిక్రమ్ మూవీతో సూపర్ స్టార్ మహేష్ వచ్చేయనున్నాడు. జక్కన్నతో సినిమా ఎన్నాళ్లు పడుతుందో చెప్పలేం.