భారతీయ ఇతిహాసాలు, పురాణాల్ని ఒకప్పుడు సినిమాల రూపంలో తెరపై చూపించారు. అయితే అప్పటి దర్శకులు పుస్తకాలలో ఉండే ఒరిజినల్ కథలకి కొంత కల్పితం జోడించి ప్రేక్షకులని ఆకట్టుకునేందుకు ఇంటరెస్టింగ్ డైలాగ్స్ జోడించి ప్రెజెంట్ చేసేవారు. ఇతిహాసాలలో లేని కథలని కూడా తెరపై ఆవిష్కరించి నిజమని నమ్మించారు. అలా వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న చిత్రం మాయాబజార్. ఈ మూవీ టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అలాగే దానవీరసూరకర్ణ సినిమాలో కర్ణుడిని హీరోగా చూపించారు.
ఆ సినిమా చూసిన తర్వాత కర్ణుడి క్యారెక్టర్ ని చాలా మంది ఇష్టపడటం మొదలుపెట్టారు. ఇప్పటికీ కూడా ఒకప్పుడు తీసిన పౌరాణిక సినిమాల ప్రభావం ప్రజల మీద ఉంది. వాటిలో ఉన్న కథలని వాస్తవం అని నమ్ముతూ ఉంటారు. అయితే గత కొన్నేళ్లుగా ఇతిహాసాల మీద ప్రజలకి అవగాహనా పెరుగుతుంది. ప్రవచనకర్తలు, పండితుల కారణంగా అసలు వ్యాస మహర్షి రాసిన ఇతిహాసాలలో ఉన్నదేంటి… సినిమాల ద్వారా ప్రజలలోకి వెళ్ళింది ఏంటి అనే విషయాలపై స్పష్టత పెరిగింది.
అలాగే ఈ ఇతిహాసాలు, పురాణాలు హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న గ్రంథాలుగా ఉన్నాయి. వీటిని దృశ్యరూపంలో ఆవిష్కరించినపుడు గ్రంథాలలో ఉన్నది ఉన్నట్లు చూపించాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయి. దర్శకులు ఏ మాత్రం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఫిక్షనల్ ఎలిమెంట్స్ జోడించిన యాక్సప్ట్ చేయడం లేదు. ఆదిపురుష్ మూవీపై ఎంత వివాదం అయ్యిందో అందరికి తెలిసిందే. అలాగే కల్కి సినిమాలో కర్ణుడిని హీరోగా చూపించడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. ఇతిహాసాలని తెరపై ఆవిష్కరించడం కత్తిమీద సాములాంటిది.
ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాని మైథాలజీ ఆధారంగానే తెరకెక్కిస్తున్నారంట. నిజానికి త్రివిక్రమ్ ప్రతి కథలో కూడా రామాయణం, మహాభారతం అంశాలని సందర్బోచితంగా డైలాగ్స్ రూపంలో వాడుతారు. ఈ సారి ఏకంగా మైథాలజీ కథాంశంతో మూవీ చేయాలని అనుకుంటున్నారు. కల్కి సినిమా విషయంలో ఇతిహాసాన్ని కరెక్ట్ గా రిప్రజెంట్ చేయడంలో నాగ్ అశ్విన్ కొంత తడబడ్డారనే టాక్ వచ్చింది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ వాటిని ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఒరిజినాలిటీ మిస్ కాకుండా చూపించగలరా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఇతిహాసాల మీద మంచి పట్టుంది. అలాగే అతని సినిమాలలో హీరోల క్యారెక్టర్స్ ని కూడా ఇతిహాసాల రిఫరెన్స్ తో డిజైన్ చేస్తారు. డైలాగ్స్ పై త్రివిక్రమ్ కి ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కచ్చితంగా అతను సరైన కథని పట్టుకొని తెరపై ఆవిష్కరిస్తే అద్భుతంగా నేరేట్ చేయగలడనే మాట వినిపిస్తోంది. అతని బలం కథనం, సంభాషణలు. ఆ రెండు బాగుంటే మూవీ ఆటోమేటిక్ గా పబ్లిక్ కి కనెక్ట్ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.