త్రిష ఔట్‌: క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌.!

‘సామి స్క్వేర్‌’.. అదేనండీ ‘సామి-2’ సినిమా నుంచి త్రిష తప్పుకుంది. చాలాకాలం క్రిందట విక్రమ్‌ హీరోగా వచ్చిన ‘సామి’ అప్పట్లో పెద్ద విజయమే సాధించింది. అదే సినిమాని తెలుగులో ‘లక్ష్మీనరసింహ’ పేరుతో బాలకృష్ణ హీరోగా రీమేక్‌ చేసిన విషయం విదితమే. తెలుగులోనూ ‘లక్ష్మీనరసింహ’ మంచి విజయాన్నే అందుకుంది.

ఇక, ‘సామి-2’ సినిమా కోసం త్రిషతోపాటుగా, కీర్తి సురేష్‌ని విక్రమ్‌ సరసన హీరోయిన్లుగా ఎంపిక చేసినా, ఏమయ్యిందోగానీ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు తనంతట తానుగా త్రిష సోషల్‌ మీడియాలో ప్రకటించడం గమనార్హం. ‘క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ కారణంగా సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.. ఆల్‌ ది బెస్ట్‌ టు సామి-2’ అంటూ సోషల్‌ మీడియాలో త్రిష చెప్పుకొచ్చింది.

ఓ డైరెక్టర్‌కీ, సినిమాటోగ్రాఫర్‌కీ లేదంటే.. డైరెక్టర్‌కీ మ్యూజిక్‌ డైరెక్టర్‌కీ.. క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వస్తే రావొచ్చుగాక. కానీ, హీరోయిన్‌కి సినిమా టీమ్‌తో క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ రావడమేంటట.? ఏమో మరి, త్రిషకే తెలియాలి. ఈ సినిమాకి హరి దర్శకత్వం వహిస్తోన్న విషయం విదితమే.

అన్నట్టు, త్రిష చేతిలో దాదాపు డజను సినిమాలున్నాయిప్పుడు. వాటిల్లో ఎన్ని విడుదలవుతాయో, ఎన్ని అటకెక్కుతాయో.. ఎన్ని సినిమాల్లోంచి ఆమె తనంతట తానుగా తప్పుకుంటుందోగానీ.. త్రిష టైమ్‌ ఏమంత గొప్పగా వున్నట్లు కన్పించడంలేదిప్పుడు.