అవును మీరు చదువుతున్నది నిజమే. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా …కొందరి విషయంలో మంచి కూడా చేస్తోంది. ఆ మంచి కూడా జీవితాంతం గుర్తించుకునేలా ఉంటోంది. చైనాలో ఓ ప్రమాదంలో మతిమరుపుకు గురై… తన వాళ్లకు మూడు దశాబ్దాల పాటు దూరమైన వ్యక్తికి కరోనా వల్ల కలిగిన లబ్ధి గురించి మూడు రోజుల క్రితం మీడియా ద్వారా తెలుసుకున్నాం.
ఇప్పుడు అలాంటిది కాకపోయినా…మరో రకమైన ప్రయోజనాన్ని హీరో హృతిక్ రోషన్ పొందాడు. మనుషుల మధ్య దూరాన్ని కరోనా పెంచడం గురించి మాత్రమే మనం తెలుసుకున్నాం. కానీ విడివిడిగా ఉంటున్న హీరో హృతిక్ దంపతులతో పాటు వారి పిల్లలను ఒకే ఇంటికి చేర్చిన ఘనత కరోనాకు దక్కింది.
విభేదాల కారణంగా హృతిక్ రోషన్, ఆయన భార్య సుజానే ఖాన్ వేర్వేరుగా ఉంటున్నారు. కానీ కరోనా వారిద్దరినీ ఎలా కలిపిందో కచ్చితంగా తెలుసుకోవాలి. హృతిక్, సుజానే విడిపోయి ఆరేళ్లు పైనే అయింది. వీరికి ఇద్దరు కుమారులు. తల్లి దగ్గర కొన్నాళ్లు, తండ్రి దగ్గర కొన్నాళ్లు పిల్లలు ఉంటారు. పండగలు, పార్టీలను మాత్రం భార్యాభర్తలిద్దరూ పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు.
ప్రస్తుతం పిల్లలు హృతిక్ దగ్గర ఉంటున్నారు. లాక్‌డౌన్‌తో హృతిక్‌తో పాటు పిల్లలు కూడా ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు కుదర్లేదు. ఈ నేపథ్యంలో పిల్లలను విడిచి తల్లి సుజానే ఉండలేకపోయారు. అందులోనూ కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో పిల్లలను మిస్ కావడం ఆమె వెలతిగా భావించారు.
వెంటనే పిల్లల దగ్గరకు వెళ్లాలని ఆమె భావించారు. పిల్లల దగ్గర గడిపేందుకు అందుకు తగ్గ ఏర్పాట్లతో సూట్‌కేస్ తీసుకుని తన మాజీ భర్త హృతిక్ ఇంటికి ఆమె వెళ్లిపోయారు.
తన మాజీ భార్య తనింటికి రావడం హృతిక్‌ను చాలా ఆనందపరిచింది. దీంతో ఆయన ఈ విషయాన్నిపది మంతితో పంచుకోవాలనుకున్నాడు. ‘‘పిల్లలతో గడపాలని నా మాజీ భార్య మా ఇంటికి వచ్చింది. ఈ టైమ్‌లో పిల్లలతో పాటు తను ఉండటం చాలా అవసరం. థ్యాంక్యూ సుజానే’’ అని హృతిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
తన మాజీ భార్య తనింటికి రావడానికి ప్రధాన కారణమైన కరోనాకు హృతిక్ ధ్యాంక్స్ చెప్పాలని నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం. బహుశా కరోనాకు చెబితే మరోలా అర్థం చేసుకుంటారని భావించి హృతిక్ అలా చెప్పి ఉంటారేమో.