విశాల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘తుప్పరివాలన్-2’. రెండేళ్ల కిందట అతడి నుంచి వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘తుప్పరివాలన్’ (డిటెక్టివ్)కు సీక్వెల్ ఈ సినిమా. ఫస్ట్ మూవీకి మిస్కిన్ దర్శకత్వం వహించాడు. ఆయన దర్శకత్వంలోనే రెండో సినిమా కూడా మొదలైంది. కొన్నాళ్లు షూటింగ్ కూడా జరిగింది. ఇక సినిమా ముగియడమే తరువాయి అనుకున్నారు.
కానీ మధ్యలో ట్విస్ట్ పేలింది. మిస్కిన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. విశాల్ దర్శకత్వ బాధ్యతలు అందుకున్నాడు. దీనిపై ఇంతకుముందే సమాచారం బయటికి వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతోందని విశాల్ అప్ డేట్ ఇస్తే.. పోస్టర్ మీద దర్శకులుగా మిస్కిన్, విశాల్ ఇద్దరి పేర్లూ ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే విశాల్ ఒక్కడి పేరే కనిపించింది.
ఐతే విశాల్‌కు, మిస్కిన్కు ఎన్ని గొడవలైనా ఉండనీ.. మిస్కిన్ ఏం తప్పులైనా చేసి ఉండనీ.. ఇప్పుడు విశాల్ ఒక్కడి పేరు పోస్టర్ మీద పడటం న్యాయం కాదన్న చర్చ కోలీవుడ్‌లో నడుస్తోంది. ‘తుప్పరివాలన్’ పూర్తిగా మిస్కిన్ స్టయిల్లో సాగే సినిమా. అందులో ప్రతి సన్నివేశంలోనూ ఆయన మార్కుంటుంది. మనిషి వివాదాస్పదుడే కానీ.. దర్శకుడిగా మాత్రం ఆయన స్థాయే వేరు. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఒక స్పెషాలిటీ కనిపిస్తుంది. అలాంటి దర్శకుడు కొంత షూటింగ్ జరిపి మధ్యలో సినిమాను వదిలేస్తే విశాల్ టేకప్ చేశాడు.
స్క్రిప్టులో కచ్చితంగా ఆయన పాత్ర ఉంటుంది. అలాంటపుడు దర్శకుడిగా ఆయనకు జీరో క్రెడిట్ ఇచ్చి విశాల్ తన పేరు వేసుకోవడం కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఐతే సినిమాలో మిస్కిన్ రాసిన, తీసిన సన్నివేశాలేమీ లేకుంటే.. నరేటింగ్, డైరెక్షన్ స్టైల్ విషయంలో విశాల్ ఏమైనా భిన్నంగా ట్రై చేస్తేనే అతనొక్కడే క్రెడిట్ తీసుకోవడం సబబంటున్నారు. చూడాలి సినిమా ఎలా ఉంటుందో?