నాని మూడేళ్లు వెనక్కెళ్లాడు

మూడేళ్లుగా ఫ్లాప్ అన్నదే లేకుండా దూసుకెళ్లాడు నాని. మధ్యలో ‘మజ్ను’ సినిమా వసూళ్ల పరంగా అంచనాల్ని అందుకోలేకపోయింది కానీ.. అది కూడా ఫ్లాప్ ఏమీ కాదు. ‘ఎంసీఏ’ డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్ అయింది. ‘జెంటిల్‌మన్’ సినిమా కూడా ఓ మోస్తరుగా ఆడింది. కానీ గత మూడేళ్లలో నానికి నిఖార్సయిన ఫ్లాప్ మాత్రం లేదు. ఐతే ఇప్పుడతను ఫ్లాప్ కాదు… ఏకంగా డిజాస్టర్ కొట్టేశాడు.

నాని కొత్త సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ బయ్యర్ల పెట్టుబడిలో సగం కూడా వెనక్కి తేలేకపోయింది. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్‌ను హోల్‌సేల్‌గా దిల్ రాజు కొనేసిన సంగతి తెలిసిందే. ఆయన కొన్ని చోట్ల మారు బేరానికి సినిమాను అమ్మారు. మొత్తంగా థియేట్రికల్ రైట్స్ వాల్యూ రూ.30 కోట్ల దాకా ఉంది.

ఐతే తొలి వారంలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.14 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. వారమే కదా అయింది.. ఇంకా వసూళ్లు వస్తాయి కదా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ రోజు ‘భరత్ అనే నేను’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి దిగుతోంది. దీనికి యుఎస్ ప్రిమియర్ షోల నుంచి నుంచి ఆల్రెడీ పాజిటివ్ వచ్చింది. పోటీ లేనపుడే ‘కృష్ణార్జున యుద్ధం’ నిలవలేకపోయింది. ఇక పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మహేష్ సినిమాతో పోటీ పడి ఏం సాధిస్తుంది. కాబట్టి ఆ చిత్ర థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తయినట్లే.

పెట్టుబడిలో సగం కూడా వసూలు చేయలేదు కాబట్టి ఇది పెద్ద డిజాస్టర్ కిందే లెక్క. చివరగా మూడేళ్ల కిందట ‘జెండాపై కపిరాజు’తో నాని డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఆ సినిమా పెట్టుబడిలో సగం కూడా వెనక్కి తేలేకపోయింది. ఐతే అది లో బడ్జెట్ సినిమా. నష్టాలు కూడా దానికి తగ్గట్లే వచ్చాయి. కానీ ‘కృష్ణార్జున యుద్ధం’ మాత్రం భారీగా నష్టాలు మిగిల్చింది.