నవ్యాంధ్రలో ఇప్పుడు అసలు సిసలు పోరు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుల మధ్య జరగడం లేదు. జగన్, టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ల మధ్యే జరుగుతోంది. వీరిద్దరి మధ్య పోరే అటు టీడీపీ కార్యకర్తలకైనా, ఇటు వైసీపీ కార్యకర్తలకైనా ఫుల్ జోష్ నింపుతోందని చెప్పాలి.
జగన్ విపక్షంలో ఉన్నంత వరకూ ఆయా సభల్లో నారా లోకేశ్ నోట నుంచి వచ్చే కొన్ని తప్పులను పట్టుకుని నానా రాద్దాంతం చేసేవారు. ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక… నారా లోకేశ్ వంతు వచ్చింది. తరచూ జగన్ నోట నుంచి వచ్చే అచ్చు తప్పులను ఎప్పటికప్పుడు పట్టేస్తున్న లోకేశ్… జగన్ ను తనదైన శైలిలో ఆటాడేసుకుంటున్నారు.
ఇప్పటికే జగన్ ను పలుమార్లు పట్టేసిన లోకేశ్… తాజాగా ఆదివారం కూడా పట్టేసుకున్నారు. కరోనా కట్టడికి ఏపీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని వెల్లడించేందుకు మీడియా ముందుకు వచ్చిన జగన్… కరోనా తొలుత ఉత్తర కొరియాలో పుట్టిందని, అక్కడ ఒకరిని పొట్టనబెట్టుకుని ఆ తర్వాత ప్రపంచ దేశాలపై పడిందని వ్యాఖ్యానించారు. కరోనా పుట్టింది చైనాలో అయితే… జగనేంటి కరోనా జన్మస్థానం ఉత్తర కొరియా అంటున్నారని అంతా ఖంగు తిన్నారు.
లోకేశ్ అయితే వెనువెంటనే జగన్ నోట దొర్లిన తప్పును ఇట్టే పట్టేసి తన ట్విట్టర్ ఖాతాలో జగన్ వ్యాఖ్యలను పోస్ట్ చేసి జగన్ ను ఓ ఆటాడేసుకున్నారు. జగన్ మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేసిన లోకేశ్… దానికి చాలా కామెంట్లనే జత చేశారు. పారాసిటమాల్ తో కరోనాను అరికట్టవచ్చని జగన్ చేసిన కామెంట్ ను కూడా ఈ సందర్భంగా లోకేశ్ గుర్తు చేయడం గమనార్హం.