‘నా సామీ రంగ’ అంజి గాడి అల్లరే అల్లరి..

చిన్నినాయనా, బంగార్రాజు వంటి సినిమాలతో సంక్రాంతి సెంటిమెంట్ ను బాగా వాడుకున్న నాగార్జున మళ్ళీ ఇప్పుడు నా సామిరంగా.. అనే చిత్రంతో కూడా అదే ఫార్ములాతో నటిస్తున్న విషయం తెలిసిందే. 2024 సంక్రాంతికి ఎలా అయినా రిలీజ్ చేస్తామని చెబుతున్న సినిమా మేకర్స్.. శరవేగంగా షూటింగ్ పనులను కొనసాగిస్తున్నారు. రీసెంట్ గా ప్రమోషన్లను కూడా స్టార్ట్ చేశారు. ఇక నాగార్జునతోపాటు కీలక పాత్ర పోషిస్తున్న అల్లరి నరేశ్ అంజి పాత్రను పరిచయం చేశారు.

అంజిగాడు వచ్చేహెడు సూసారా.. సూసెయ్యండి… సూసెయ్యండి.. లేదంటే మాటోచ్చేత్తాది.. అంటూ అల్లరి నరేశ్.. సోషల్ మీడియాలో తన గ్లింప్స్ ను షేర్ చేశారు. పక్కా మాస్ బీట్ కు అంజిగాడి డ్యాన్స్ తో మొదలైన గ్లింప్స్.. తెగ ఆకట్టుకుంటోంది. పల్లెటూరి గెటప్ లో నరేశ్ అల్లరి మాములుగా లేదు. ఎవరు ఏమడిగినా మాటొచ్చేత్తాది అంటూ నరేశ్ అనడం చాలా సరదాగా అనిపిస్తోంది.

సినిమాలో నాగార్జున, అల్లరి నరేశ్ మధ్య కెమిస్ట్రీ పాయింట్ హైలెట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్ మధ్యలో నాగార్జునతో కలిసి డ్యాన్స్ చేయడం, బుగ్గ మీద కిస్ చేసే వంటి సీన్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. చివరగా.. సైకిల్ ను అల్లరి నరేశ్ తొక్కుతుండగా నాగార్జున వెనుక కూర్చుని పొలం గట్ల మీద షాట్ తో గ్లింప్స్ ముగించారు.

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇంతవరకు మేకర్స్ ప్రకటించలేదు. జనవరి 12వ తేదీ లేదా 14వ తేదీన ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నాగార్జునకు జోడీగా ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

మలయాళం పోరంజు మరియం సినిమాకు నా సామిరంగా రీమేక్ అని నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే ఇదే రీమేక్ కాదని దర్శకుడు విజయ్ బన్నీ చెబుతూ వస్తున్నారు. కానీ విజువల్స్ మాత్రం ఆ స్టోరీకి దగ్గరగానే ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు. అయితే హీరోల ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ కొన్ని మార్పులు చెసినట్లు సమాచారం. మరి ఈ సినిమా సంక్రాంతి ఫెస్టివల్ ను ఎంతవరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.