ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తున్న సమయంలోనే ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్ధనల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రార్ధనలకు హాజరైన వారు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వెయ్యిమంది వరకు ఉంటారనేది అంచనా. వారు ఢిల్లీనుంచి తిరిగి వచ్చి కూడా చాలా రోజులు గడిచాయి. ఈ నేపథ్యంలో.. వారందరూ ఎవరో ట్రేస్ చేయడం, అప్పటినుంచి ఇప్పటిదాకా ఎవరెవరితో కలిశారో కూడా వివరాలు సేకరించి… కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది.
ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్ధనలకు వెళ్లిన వారెవరో లెక్క తేల్చడానికి ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోంది. ఢిల్లీ వర్గాలనుంచి సమాచారం సేకరించడానికి ఒకవైపు ప్రయత్నం జరుగుతోంది. ఢిల్లీనుంచి తిరిగివచ్చేప్పుడు వారు ఏ రైళ్లలో ప్రయాణించారు. ఏ బోగీల్లో ఉన్నారో కూడా తెలుసుకుని.. ఆయా బోగీల్లో ఉన్న ఇతర ప్రయాణికులందరూ రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఉన్నారో ట్రేస్ చేయడానికి కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
రైల్వే శాఖ ద్వారా ఆయా రైళ్లలో ప్రయాణించిన అందరి వివరాలను తెలుసుకోవడానికి, ఇప్పటికే నిజాముద్దీన్ వెళ్లివచ్చిన వారి ద్వారా.. ఎంత మందికి కరోనా సోకిందో తేల్చడం ప్రధాన కర్తవ్యంగా మారిపోయింది. కొందరు ఇంకా ఆచూకీ తెలియకపోవడం అనేది యావత్ రాష్ట్రాన్ని కలవరపరుస్తున్న అంశం. ఈ విషయం పూర్తిగా తేలేవరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మరిన్ని పెరగవచ్చుననే అంచనాలు సాగుతున్నాయి.
ఎంత ప్రభుత్వ పరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ప్రజల సహకారం లేకుండా కరోనా నియంత్రణ అనేది ఏమాత్రం సాధ్యం కాదు. లాక్ డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ విషయాల్లో ప్రజల సహకారం పూర్తిగా లేకపోతే.. పరిస్థితి ఇంకా ఘొరంగా ఉండేది. అదే తరహాలో.. నిజాముద్దీన్ వెళ్లిన వాళ్లు కూడా వచ్చి ప్రభుత్వంతో స్వచ్ఛందంగా ఆ విషయం చెప్పాలని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి పిలుపు ఇస్తున్నారు. ప్రజలు ఈ విషయంలో కూడా పూర్తిగా సహకరిస్తే తప్ప.. కరోనా మహమ్మారి మరింత తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ ను కబళించకుండా చూడడం అసాధ్యం.