నేను కనుక మగాడ్ని అయితే..!

నువ్వు సీఎం అయితే ఏం చేస్తావ్..? ప్రధాని మంత్రి అయితే ఏం చేస్తావ్..? కోటి రూపాయలు ఇస్తే ఏం చేస్తావ్..? లాంటి ప్రశ్నలు తరచుగా సెలబ్రిటీలకు ఎదురవుతూనే ఉంటాయి. ఇందులో భాగంగా ఓ వింత ప్రశ్న సమంతకు ఎదురైంది..? నువ్వు మగాడివైతే ఏం చేస్తావనేదే ఆ ప్రశ్న.

రంగస్థలం సినిమా ప్రచారానికి దూరమైంది సమంత. భర్త చైతూతో కలిసి అమెరికా చెక్కేసింది. రంగస్థలం సక్సెస్ ను ఫ్యాన్స్ తో సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశంతో సోషల్ మీడియాలో చిన్న చిట్ చాట్ పెట్టింది. ఇందులో భాగంగా ఆమెకు ఈ ప్రశ్న ఎదురైంది. “హాయ్ సమంత.. నువ్వు మగాడివైతే ఎవర్ని ప్రేమిస్తావ్?” అనే ప్రశ్నకు అంతే సూటిగా సమాధానమిచ్చింది సమంత.తను కనుక మగాడ్ని అయితే కచ్చితంగా దీపిక పదుకోన్ తో లవ్ లో పడతానని, తన మొట్టమొదటి క్రష్ దీపిక మాత్రమే అవుతుందని బదులిచ్చింది సమంత. అంతేకాదు, ఇదే సందర్భంగా సాయిపల్లవిని కూడా గుర్తుచేసుకుంది.

తను పిచ్చిగా ఆరాధించే హీరోయిన్ దీపిక పదుకోన్ అయితే, రీసెంట్ గా తన మైండ్ కు బాగా కనెక్ట్ అయిన హీరోయిన్ గా సాయిపల్లవిని చెప్పుకొచ్చింది. ఈమధ్య కాలంలో సాయిపల్లవిలా తనను ఎవరూ ఇంప్రెస్ చేయలేకపోయారని అంటోంది. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి అమెరికాను చుట్టేసే పనిలో ఉన్న సమంత.. త్వరలోనే తన కొత్త సినిమా ప్రాజెక్టులు ఎనౌన్స్ చేస్తానని ప్రకటించింది.