‘నేను లోకల్’ అంటున్న జగన్

ఏపీలో పాలక టీడీపీ తన మొత్తం కార్యకలాపాలు విజయవాడ సెంట్రిక్ గానే చేస్తోంది. బీజేపీ కూడా విజయవాడ బేస్డ్ గానే రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్, కమ్యూనిస్టులదీ అదే దారి.. కానీ, ఎందుకో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం ఇంకా విజయవాడకు పూర్తిస్థాయిలో షిఫ్టు కాలేదు.  వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ లోని తన నివాసం లోటస్ పాండ్ కేంద్రంగానే పార్టీని నడిపిస్తున్నారు. అయితే.. కొంతలో కొంత నయంగా గత నెలరోజులుగా విజయవాడలో ఆ పార్టీ యాక్టివిటీ పెంచారు. త్వరలో మిగతా పార్టీల మాదిరిగానే విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు నడిపించాలని జగన్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో… పార్టీ నేతలు, క్యాడర్ లో హుషారు కనిపిస్తోంది.. రాజధాని ఏరియా నుంచే రాజకీయానికి రెడీ అంటున్నారు.

రాష్ట్ర రాజధాని అమరావతిలో పార్టీ కార్యకలాపాలు ఇకపై మరింత ముమ్మరం చేయాలని జగన్ నిర్ణయించారు. ఆ మేరకు శాశ్వత భవనం నిర్మించుకునే వరకూ విజయవాడ నగరంలోనే తాత్కాలికంగానయినా నివాసం ఉండాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని ప్రాంత ప్రధాన నగరమైన విజయవాడలో పార్టీ పట్టుసాధించాలంటే అక్కడ బలంగా ఉన్న కమ్మ సామాజికవర్గ హవాను ఎదుర్కొనేందుకు మరొక బలమైన కాపు సామాజికవర్గ సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు.

కాపులతోపాటు, నగరంలో బలంగా ఉన్న బ్రాహ్మణ, వైశ్య, యాదవ వర్గాలనూ సమన్వయం చేసుకుంటేనే బెజవాడలో ఉనికి చాటుకోగలమని గ్రహించిన జగన్, ఆ మేరకు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీలో నగర స్థాయిలో కీలకనేతగా ఉన్న బ్రాహ్మణ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేను త్వరలో పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వైశ్య వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ను పార్టీలో చేర్చుకుని ఆయనకు నగర పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. యాదవ వర్గానికి చెందిన పార్ధసారథిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. కాగా, ఇక రాజధాని నగరాలైన గుంటూరు, విజయవాడలో పార్టీ కార్యకలాపాలు విస్తరించాలని నిర్ణయించిన జగన్, తాను కూడా విజయవాడలోనే నివాసం ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.

తాము విజయవాడకు దూరంగా ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీకే లబ్ధి చేకూరుతోందని, తన పార్టీ నేతలు కూడా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాలు నిర్వహించడం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదని జగన్ గ్రహించారు. ఇటీవల విజయవాడ-గుంటూరులో రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేందర్‌రెడ్డి, అంబటి రాంబాబు సమావేశాలకు మీడియాలో ప్రాధాన్యం వచ్చిన విషయాన్ని గ్రహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తాను రాజధానిలో ఉంటే అధికారపార్టీ కూడా జాగ్రత్తగా ఉంటుందని, వైసీపీ నేతలు కూడా ఉత్సాహంగా పనిచేస్తారని ఆయన అంచనా వేస్తున్నారట.  పార్టీ కార్యకలాపాల వేడి పెంచడం వల్ల కార్యకర్తల్లో కూడా ఉత్సాహం పెరుగుతుందని, తాను హైదరాబాద్‌లో ఉండి, ఆంధ్రలో పార్టీని బలోపేతం చేయడం కంటే లోకల్ గా ఉండడం బెటరని జగన్ డిసైడైనట్లు సమాచారం.