నేను లోకల్ మాయలో పడిపోయాడు!

కథలేకుండా కాంబినేషన్లు పనిచేస్తాయా..? ఇప్పుడీ విషయం గురించి ఆలోచించే స్థితిలో లేడు హీరో రామ్. వరుసగా 2ఫ్లాపులు వచ్చేసరికి కాంబినేషన్ల ట్రాప్ లో పడిపోయాడు. నేను లోకల్ హిట్ అయింది కాబట్టి ఆ దర్శకుడిని, ఆ సినిమాకు కథ రాసిన రచయితను పెట్టుకున్నాడు. హిట్ కొట్టిన దర్శకుడ్ని, కథా రచయితను పెట్టుకోవడంలో తప్పులేదు. కానీ నేను లోకల్ హిట్ అయింది కాబట్టి అలాంటి స్టోరీలైనే కావాలని కోరుకోవడం తప్పు. అవును.. రామ్ కొత్త సినిమా కూడా దాదాపు నేనులోకల్ ట్రాక్ లోనే నడుస్తుందట.

నేను లోకల్ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. సో.. సెటప్ డిస్టర్బ్ కాకూడదనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు కూడా దేవిశ్రీప్రసాద్ నే తీసుకున్నారు. తను బిజీగా ఉన్నాను, కుదరదని చెప్పినప్పటికీ దిల్ రాజుతో లాబీయింగ్ చేసి మరీ దేవిశ్రీని పెట్టుకున్నారట. ఇక హీరోయిన్ గా కీర్తిసురేష్ ను కూడా రిపీట్ చేద్దాం అనుకున్నారు కానీ ఆమె కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయలేకపోవడంతో అనుపమ పరమేశ్వరన్ తో సరిపెట్టుకున్నారు. ఇక లాబీయింగ్ కుదరలేదు.

హీరో హీరోయిన్లు తప్ప.. మిగతా వాళ్లంతా దాదాపు నేనులోకల్ సినిమాకు పనిచేసినవాళ్లే. అలా రిపీటెడ్ సెటప్ తో మార్చి 16 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. జూన్ లో మూవీని థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్.