న‌ట‌వార‌సుల‌తో సినిమా బిజినెస్ బిగ్ రిస్క్

గాడ్‌ఫాదర్‌ లేకుండా సినిమా, రాజకీయాలు రెండిటిలోనూ రాణించిన వారు ఉన్నార‌ని, అయితే ఏ రంగంలోనైనా మార్గ‌ద‌ర్శ‌కుడు ఉండటం విమర్శలకు అర్హమని న‌టుడు కం రాజకీయ నాయకుడు శతృఘ్న సిన్హా అన్నారు. ఆయ‌న జాతీయ మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. సినీరంగం కాకుండా ఇతర రంగాలలో కొడుకులు, కుమార్తెలు తమ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నా కానీ వారిని వ‌దిలేసి, కేవ‌లం బాలీవుడ్ లేదా రాజకీయాలపై ఎందుకు వేళ్లు చూపిస్తున్నారని ప్రశ్నించారు.

తండ్రి కొడుకుకు వెన్నుపోటు పొడిస్తే దానిని బంధుప్రీతి అంటారా? డాక్టర్ కొడుకు డాక్టర్ అయ్యే విధానం, వ్యాపారవేత్త కొడుకు వ్యాపారాన్ని చేజిక్కించుకున్న తీరు ఇలాంటి వాటిపై మీరు ఏమీ అనకండి! అని షాట్ గ‌న్ అన్నారు. కుటుంబ వ్యాపారంలో ఉండటం ఎల్లప్పుడూ విజయానికి హామీ ఇవ్వదు. వాస్తవంలో ఇది భారీ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సినిమాలను నిర్మించడంలో రిస్కు ఎక్కువ‌. భారీ మొత్తంలో డబ్బు చేరి ఉంటుంది..

ఇది చాలా రిస్క్ తో కూడిన వ్యాపారం అని సిన్హా అన్నారు. కుటుంబ సభ్యులపై ఆ రిస్క్ చేయాల్సి వస్తే, అది రిస్క్‌గానే మిగిలిపోతుంది. కానీ రాజ్ కపూర్ … రిషి కపూర్‌తో రిస్క్ తీసుకున్న విధానం అతడిని `బాబీ` చిత్రానికి ఉపయోగించుకోవడం ఫలించింది. తప్పు ఏమీ లేదని నేను అనుకోను. ఆ చిత్రంలో అతడు (రిషి కపూర్) గొప్పగా న‌టించాడు… అని అన్నారు.

తన మాతృభూమి అయిన బీహార్ నుంచే కాకుండా భారతదేశంలోని ప్రతి ప్రాంతం నుంచి వేలాదిగా బాలీవుడ్ కలలతో వస్తారని సిన్హాజీ చెప్పారు. కానీ రాష్ట్రాల పరంగా చూస్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమితాబ్ బచ్చన్, పంజాబ్‌కు చెందిన ధర్మేంద్ర, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అనుపమ్ ఖేర్ ప‌రిశ్ర‌మ‌లో రాణించిన వారిలో ఉన్నారు. తాను మాత్రం బీహార్‌కు చెందిన మెగాస్టార్‌ని అని అన్నారు. ప్రతి తరంలో చాలా తక్కువ మంది గురించి మాత్రమే గొప్పగా చెప్పుకోగల‌మ‌ని అన్నారు. “మేం మెరిట్‌తో వచ్చాము… అంతకంటే ఎక్కువ“అని కూడా సిన్హాజీ అన్నారు.