పంచాయితీగా రెడీ.. తరుణ్ భాస్కర్ క్యాస్టింగ్ ఆఫర్

పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న తరుణ్ భాస్కర్ తరువాత ఈ నగరానికి ఏమైంది అనే మూవీతో మరో హిట్ అందుకున్నారు. గత ఏడాది కీడాకోలా అనే సినిమా చేశారు. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. అయితే దర్శకుడిగా చాలా లాంగ్ గ్యాప్ తీసుకుంటూ మూవీస్ చేస్తోన్న తరుణ్ భాస్కర్ నటుడిగా బిజీ అయ్యే పనిలో ఉన్నారు. మీకు మాత్రమే చెప్తా సినిమాతో హీరోగా మారిన తరుణ్ భాస్కర్ కీడాకోలా చిత్రంలో కూడా లీడ్ రోల్ చేశారు.

నటుడిగా మంచి పెర్ఫార్మెన్స్ తో తరుణ్ భాస్కర్ వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. దూత అనే వెబ్ సిరీస్ లో కూడా తరుణ్ భాస్కర్ విలన్ గా నటించాడు. అలాగే సీతారామం సినిమాలో మంచి రోల్ చేశారు. ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ మూవీని తరుణ్ భాస్కర్ సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో మరో టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఊడుగుల నిర్మాతగా మారడం విశేషం. యారో సినిమాస్ బ్యానర్ అధినేత బోనం జగన్ మోహన్ రెడ్డి ఈ కొత్త సినిమాని నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.

ఈ సినిమాతో వంశీ రెడ్డి దొండపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోగా తరుణ్ భాస్కర్ కనిపించబోతున్నారు. మిగిలిన ఆర్టిస్ట్స్ కోసం క్యాస్టింగ్ కాల్ ఇచ్చారు. ఇడుపు కాయితం అంటూ ఒక ప్రామిసరీ నోట్ మీద ఇంటరెస్టింగ్ విషయాలు రాశారు. ఇల్లంతకుంట సీతారామచంద్రమూర్తి గుడి వెనుక సమ్మక్క సారలమ్మ గద్దెకాడ, మర్రిచెట్టు క్రింద జమ్మికుంట వాస్తవ్యులైన బూర సమ్మయ్యగౌడ్ బిడ్డ శ్రీలతకి పొత్కపల్లి గ్రామ వాస్తవ్యులైన గొడిశాల పోశాలు కొడుకు శ్రీనివాస్ గౌడ్ కి ఇడుపు కాయితం పంచాయితీ జరుగుతుంది.

ఆ పంచాయితీలో పెద్దలుగా, సాక్ష్యులుగా, కుటుంబ సభ్యులుగా నటించడానికి నటీనటులు కావాలే… ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు సంప్రదించండి అంటూ క్యాస్టింగ్ కాల్ ని రిలీజ్ చేశారు. తరుణ్ భాస్కర్ కాకుండా మిగిలిన నటీనటులుగా అందరూ కొత్తవాళ్లని ఈ సినిమా కోసం తీసుకోబోతున్నట్లు ఈ క్యాస్టింగ్ కాల్ బట్టి తెలుస్తోంది. అక్టోబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందంట.

ఈ క్యాస్టింగ్ కాల్ చూస్తుంటే కాన్సెప్ట్ ఏదో కొత్తగానే ఉన్నట్లుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో భార్యాభర్తల గొడవలు, పెద్దమనుషుల పంచాయితీ నేపథ్యంలో రియాలిటీకి దగ్గరగా ఉండే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కబోతోందని ఇడుపు కాయితం బట్టి అర్ధమవుతోంది.