అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలు చేయడం మొదలు పెట్టాడు. రెండు సంవత్సరాలు పూర్తిగా సినిమాలకు దూరం అయ్యాడు. అయితే ఆర్థికపరమైన అవసరాల కోసం అంటూ పవన్ మళ్లీ సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దారుణ పరాజయంను చవిచూశాడు. జనసేన పార్టీ మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఆయన పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఆయనకు తీవ్ర నిరాశ ఎదురైంది.
పవన్ కళ్యాణ్‌కు గతంతో పోల్చితే ఇప్పుడు చాలా క్రేజ్ తగ్గి ఉంటుందని, ఆయన రాజకీయాల్లోకి వెళ్లి చాలా పెద్ద తప్పు చేశాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ క్రేజ్ తగ్గుతున్న ఈ సమయంలో మళ్లీ సినిమాలు చేసి రాజకీయంగా నిలదొక్కుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేశారు. కాని పవన్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత క్రేజ్ ఇసుమంత అయినా కూడా తగ్గలేదని తాజాగా వచ్చిన వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ తో తేలిపోయింది.
క్రేజ్ తగ్గడం కాదు కదా పెరిగిందని పరిస్థితిని చూస్తుంటే అనిపిస్తుంది. రెండేళ్ల తర్వాత రావడం వల్ల ఫస్ట్ లుక్ రిలీజ్‌నే అభిమానులు ఒక పండుగ మాదిరిగా చేసుకున్నారు. స్టార్ హీరోల సినిమాలకు విడుదల రోజు ఎలాంటి హడావుడి అయితే ఉంటుందో ఆ హడావుడి ఎక్కడ చూసినా కనిపించింది. పవన్ కళ్యాణ్ పోస్టర్‌కు పాలాభిషేకాలు.. బ్యాండ్‌తో తీన్మార్ స్టెప్పులు ఇలా ఒకటేంటి అన్ని విధాలుగా వకీల్‌సాబ్ మారు మ్రోగిపోయింది.
జాతీయ స్థాయిలో ట్విట్టర్‌లో వరుసగా మూడు హ్యాష్ ట్యాగ్‌లు వకీల్‌సాబ్‌కు చెందినవి టాప్‌లో నిలిచాయి అంటే పవన్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని గంటల వ్యవధిలో 2.1 మిలియన్‌ల ట్వీట్స్ వకీల్‌సాబ్ గురించి పోస్ట్‌లు పడటంతో ప్రపంచ స్థాయిలో కూడా ట్విట్టర్‌లో ట్రెండ్ అయ్యింది. ఇక సినిమా విడుదల అయిన రోజు పరిస్థితి ఎలా ఉంటుందో. మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.