పాట పాడితే ప్రాణం తీసేస్తారా.?

తమిళ హీరో శింబు ఇటీవల ఓ పాటతో వార్తల్లోకెక్కాడు. ‘నో క్యాష్‌’ అంటూ సాగే ఆ పాట, ‘పెద్ద పాత నోట్ల రద్దు’ జరిగి, ఏడాది పూర్తయిన సందర్భంలో నవంబర్‌ 8న విడుదల కావడం గమనార్హం. ఈ పాటని శింబు ఆలపించాడు. నిజానికి, శింబు నటుడు మాత్రమే కాదు, ‘సకల కలా వల్లభుడు’. అది సినిమా అయినా, ఇంకోటైనా.. శింబు రూటే సెపరేటు. నయనతారతో లవ్‌ ఎఫైర్‌ తర్వాత, హీరోగా శింబు కెరీర్‌ చాలా కుదుపుల్ని ఎదుర్కొన్న విషయం విదితమే.

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు టి.రాజేందర్‌ తనయుడే శిలంబరసన్‌ అలియాస్‌ శింబు. తండ్రి సైతం వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌.. అదే వారసత్వం శింబుకి కూడా అలా అలా వచ్చేసింది. ఇప్పుడు తన పాటతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు శింబు. ‘కొలవెరి’ పాట స్థాయిలో కాకపోయినా, ఆ పాట తర్వాత అంతటి స్థాయిలో శింబు పాడిన ‘నో క్యాష్‌’ సోషల్‌ మీడియాలో ఓ సంచలనంగా మారిపోయింది.

పూర్తిగా రాజకీయ ఆలోచనలతోనే శింబు ఈ పాట చేశాడంటూ, కమలనాథులు షరామామూలుగానే శింబుపై కారాలూ మిరియాలూ నూరేస్తున్నారు. ఈ దశాబ్దలోనే ఘోరమైన వైఫల్యంగా పెద్ద పాత నోట్ల రద్దు వ్యవహారాన్ని ఆర్థిక రంగ నిపుణులు అభివర్ణిస్తున్న వేళ, నరేంద్రమోడీ తీసుకొచ్చిన ఈ చెత్త సంస్కరణని ఎలా వెనకేసుకురావాలో తెలియని పరిస్థితి. అందుకే, ఎవరు ఆ పెద్ద నోట్ల రద్దుని వ్యతిరేకించినా, విరుచుకుపడిపోతున్నారు.. భౌతికదాడులకూ వెరవబోమంటున్నారు ‘మోడీ ఫ్యాన్స్‌’.!

శింబు సైతం ఇప్పుడు వారి నుంచి ‘థ్రెట్‌’ని ఎదుర్కొనాల్సి వస్తోంది. పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా శింబుకి ప్రొటెక్షన్‌ అందిస్తున్నారు. మరోపక్క, శింబు ఈ వ్యవహారంపై మాట్లాడుతూ, ‘నేను పాట మాత్రమే పాడాను.. అందులో లిరిక్స్‌ వేరే వ్యక్తి రాసినవి.. మ్యూజిక్‌ ఇంకొకరు కంపోజ్‌ చేశారు. ఓ గాయకుడికి పాట పాడే స్వేచ్ఛ లేదా.? ఓ రచయితకి పాట రాసే స్వేచ్ఛ లేదా.? ఓ సంగీత దర్శకుడికి స్వరం సమకూర్చే స్వేచ్ఛ లేదా.?’ అని ప్రశ్నించాడు.

‘అయినా, ఆ పాటలో తప్పేముందని.? ఏడాది క్రితం, ఇదే రోజుల్లో డబ్బుల కోసం ఏటీఎం క్యూలైన్లలో జనం ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.. బ్యాంకుల ముందు వృద్ధులు సైతం పాట్లు పడాల్సి వచ్చింది. ఇవన్నీ నిజమే కదా.! ఆ పాటలో చెప్పిన విషయాలూ అవే..’ అంటూ క్లారిటీ ఇచ్చాడు శింబు.

మొత్తమ్మీద, ‘గాయకుడిగా పాట మాత్రమే పాడాను..’ అంటూనే, పెద్ద పాత నోట్ల రద్దుపై తన వ్యతిరేకతను పూర్తిస్థాయిలో చాటుకున్న శింబు, కమలనాథులకి ఓ రేంజ్‌లో కిర్రాకు పుట్టించేస్తున్నాడన్నమాట. సినిమాలు తేడా కొట్టేస్తున్నా, ఈ ఒక్క వివాదం మళ్ళీ శింబుని హాట్‌ టాపిక్‌గా వార్తల్లోకెక్కించేసింది.