పార్ట్‌ – 3 అవసరమా సర్‌…!

యూనివర్శల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమాతో తిరిగి పుంజుకున్నాడు అనుకుంటున్న సమయంలో ఇండియన్‌ 2 తో పెద్ద దెబ్బే తగిలింది. కమల్‌ ఫ్యాన్స్ కూడా ఇదేం సినిమా బాబోయ్‌ అంటూ దర్శకుడు శంకర్‌ మేకింగ్ పై విమర్శలు చేశారు. వందల కోట్ల వసూళ్లు నమోదు చేయడం ఖాయం అనుకుంటున్న సమయంలో ఇండియన్ 2 కనీసం బడ్జెట్‌ లో సగం కూడా రాబట్టలేక పోయిందని బాక్సాఫీస్‌ వర్గాల్లో చర్చ సాగింది. కమల్‌ సినిమాలు మరీ ఇంత దారుణంగా ఫ్లాప్ అవ్వడం ఇదే ప్రథమం అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇండియన్‌ 2 సినిమాలో కమల్‌ హాసన్ మేకోవర్‌ ను కూడా చాలా మంది విమర్శించారు. అసలు కథ లేకుండానే సినిమా ను తీశాడు అంటూ కొందరు విమర్శిస్తే మరి కొందరు మధ్యలో ఆగిపోయినప్పుడు ఈ సినిమాను అలాగే వదిలేసి ఉండాల్సిందే. అనవసరంగా తిరిగి ప్రారంభించి సినిమా పూర్తి చేసి నిర్మాతకు భారం పెంచారు అలాగే ప్రేక్షకులకు మరియు ఫ్యాన్స్ కి వేదన మిగిల్చారు అంటూ ట్రోల్స్ వచ్చాయి. ఆ విషయాలను పక్కన పెడితే ఇండియన్ 3 గురించి గతంలోనే దర్శకుడు శంకర్ మరియు కమల్‌ హాసన్‌ లు ప్రకటించిన విషయం తెల్సిందే.

ఒక ఇంటర్వ్యూలో ఇండియన్‌ 2 తో పోల్చితే ఇండియన్ 3 అద్భుతంగా ఉండబోతుంది అంటూ ప్రకటించారు. అంతే కాకుండా ఇండియన్‌ 3 లో తన పాత్ర అంతకు మించి అన్నట్లుగా ఉంటుందని కూడా కమల్‌ హాసన్ చెప్పడంతో ఆ సమయంలో ఇండియన్‌ 2 చూడటం కంటే ఇండియన్ 3 కోసం వెయిట్‌ చేయడం బెటర్ అన్నట్లుగా కొందరు ప్రేక్షకులు భావించారు. ఇండియన్ 2 డిజాస్టర్‌ అయినా కూడా ఇండియన్ 3 ఉంటుందని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. దర్శకుడు శంకర్ ఇప్పటికే స్టోరీ రెడీ చేసి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాడనే వార్తలు వచ్చాయి.

తాజాగా తమిళ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ 3 విషయంలో దర్శకుడు శంకర్‌ తో పాటు హీరో కమల్‌ హాసన్ లు ఆలోచనలో పడ్డారట. ఇండియన్ 2 ఫలితం తర్వాత ఇండియన్ 3 ఎంత చేసినా కూడా బజ్‌ క్రియేట్‌ అవ్వడం కష్టం. కనుక ఎక్కువ కష్టపడకుండా ఇండియన్ 3 ప్రాజెక్ట్‌ ను పక్కకు పెట్టడం ఉత్తమం అనే అభిప్రాయం కు వారు వచ్చారట. మరో వైపు ఇండియన్ 3 కి సదరు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఆసక్తిగా లేదని, మరే ప్రొడక్షన్‌ సంస్థ కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదని వార్తలు వస్తున్నాయి.

ఇండియన్ 3 ని భారీ బడ్జెట్ తో దర్శకుడు శంకర్ తీయాలని భావించాడు. ఆయన్ను నమ్మి అంత బడ్జెట్‌ పెట్టేందుకు ఏ నిర్మాణ సంస్థ కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అందుకే పార్ట్‌ 3 అవసరమా సర్‌ అంటూ కొందరు శంకర్ మరియు కమల్‌ వద్ద అన్నారనే పుకార్లు తమిళ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇండియన్ 2 హిట్ అయ్యి భారీ వసూళ్లు నమోదు చేసి ఉంటే కచ్చితంగా ఇప్పటి వరకు పార్ట్‌ 3 కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేది అంతే కాకుండా షూటింగ్‌ కార్యక్రమాలు కూడా మొదలు అయ్యేవి. ఇప్పుడు ఇండియన్‌ 3 గురించి అధికారిక ప్రకటన శంకర్‌ లేదా కమల్‌ నుంచి రావాల్సి ఉంది.