ప్రమాదంలో కాలు కోల్పోయిన యువహీరో

ఇది అత్యంత విచారకర ఘటన. ప్రమాదం లో వర్థమాన కథానాయకుడు కాలు పోగొట్టుకున్న ఈ ఘటన సినీపరిశ్రమలో విషాదాన్ని నింపింది. దివంగత లెజెండరీ డా.రాజ్ కుమార్ కుటుంబీకుడు.. కన్నడ నటుడు ధృవన్ అలియాస్ సూరజ్ కుమార్ జూన్ 24న బేగూర్ సమీపంలో మైసూరు-గుండ్లుపేర్ హైవే పై బైక్ పై వెళుతుండగా పెద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడి ని మైసూరు లోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.

మీడియా కథనాల ప్రకారం…సూరజ్ తన కుడి కాలును కోల్పోయాడు. కాలుకు చాలా పెద్ద గాయం అవ్వడంతో అతని ప్రాణాల ను కాపాడటానికి వైద్యులు దానిని తొలగించవలసి వచ్చింది. బైక్ రైడింగ్ లో ఉన్న సూరజ్ తన బైక్ పై మైసూరు నుంచి ఊటీకి వెళ్తున్నాడు. శనివారం సాయంత్రం 4 గంటల సమయం లో ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో బైక్ అదుపు తప్పి టిప్పర్ లారీ ని ఢీకొట్టింది. అతడి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు కాలు ను మోకాలి కిందకు తొలగించారు.

సూరజ్ కుమార్ కు గాయాలు తీవ్రంగా అవ్వటంతో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అతని ప్రాణాల ను కాపాడేందుకు కాలును తొలగించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. 24 ఏళ్ల సూరజ్.. డాక్టర్ రాజ్ కుమార్ భార్య పరవతమ్మ మేనల్లుడు. ఆయన సినీ నిర్మాత ఎస్.ఏ శ్రీనివాస్ కుమారుడు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ దంపతులు ఆసుపత్రికి వెళ్లి సూరజ్ ను పరామర్శించారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే..’భగవాన్ శ్రీ కృష్ణ పరమాత్మ’ చిత్రం తో సూరజ్ కుమార్ తెరంగేట్రం చేయాల్సి ఉంది. దీనికి అనూప్ ఆంథోని దర్శకత్వం వహించారు. కన్నడ స్టార్ దర్శన్ ఈ చిత్రాన్ని ప్రారంభించారు. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా మధ్య లోనే ఆగిపోయింది.

అనంతరం సూరజ్ ‘రథం’ అనే మరో చిత్రం లో నటిస్తున్నాడు. ప్రియా ప్రకాష్ వారియర్ తో ఇంకా పేరు పెట్టని మరో ప్రాజెక్ట్ కు సంతకం చేశాడు. అయితే విధి అనుకూలంగా లేదు. ఇంత లోనే ప్రమాదంలో సూరజ్ కాలు ను పోగొట్టుకోవడం చిత్రబృందాల ను అయోమయం లోకి నెట్టింది.