టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి – ప్రభాస్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘ఛత్రపతి’ చిత్రాన్ని బెల్లంకొండ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా జూలై రెండో వారం నుండి సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. దీని కోసం భారీ వ్యయంతో హైదరాబాద్ లో ప్రత్యేకమైన సెట్ నిర్మించారు. అయితే లాక్ డౌన్ కారణంగా దొరికిన సమయాన్ని సాయి శ్రీనివాస్ తన బాడీని రెడీ చేయడానికి ఉపయోగించుకున్నాడని తెలుస్తోంది.
ఫిట్నెస్ ఫ్రీక్ అయిన బెల్లంకొండ శ్రీనివాస్ హోమ్ జిమ్ ని ఏర్పాటు చేసుకొని భారీ వర్కవుట్స్ చేస్తూ చెమటలు కక్కిస్తున్నాడు. పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవుతూ కండలు తిరిగిన దేహాన్ని సిద్ధం చేశాడు. ఇక యువ హీరో హిందీలో తన పాత్రకు తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తనకు ఆల్రెడీ హిందీ వచ్చినప్పటికీ.. ఇప్పుడు పర్ఫెక్ట్ గా పలకడం కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. హిందీ భాషపై పట్టు సాధించేందుకు ప్రసిద్ధ హిందీ కోచ్ ఇంతియాజ్ ను నియమించుకున్నాడు. ఇలా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన బాలీవుడ్ డెబ్యూ కోసం బాగా కష్టపడుతున్నాడని అర్థం అవుతోంది.
‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. ‘అల్లుడు శీను’ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా లాంచ్ చేసిన వినాయక్.. ఇప్పుడు హిందీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తుండటం గమనార్హం. హిందీలో రూపొందించే ఈ యాక్షన్ డ్రామాను పలు దక్షిణాది భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. ‘ఛత్రపతి’ ఒరిజినల్ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ రీమేక్ చిత్రానికి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై డా.జయంతిలాల్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.