బూతు కాదు.. అంతకు మించి

సినిమాల్లో అశ్లీలం పెరిగిపోతోందంటూ ఎప్పటినుంచో ఆందోళనలు జరుగుతూనే వున్నాయి. కానీ, సినిమాల్లో ‘బూతు’ కంటెంట్‌ తగ్గడంలేదు సరికదా, పెరుగుతూనే వస్తోంది. ఓ తెలుగు సినిమాలో హీరోయిన్‌ ‘నాభి’ని క్లోజ్‌గా చూపిస్తే, దాన్ని సెన్సార్‌ తప్పుపట్టడం, ఆ సీన్‌ని బ్లర్‌ చేయడం ఓ పక్క జరుగుతోంటే, ఇంకోపక్క అత్యంత దారుణమైన క్లీవేజ్‌ సీన్లు సినిమాల్లో దర్శనమిస్తున్నాయి. సెన్సార్‌ కూడా ఒక్కో సినిమా విషయంలో ఒక్కోలా వ్యవహరిస్తుంటుంది.

ఇక, కొన్ని సినిమాలకు సంబంధించి ప్రమోషన్‌ వీడియోలు, ఫొటోలతో సంబంధం లేకుండా అవి ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. ఇదో టైపు పబ్లిసిటీ స్టంట్‌ అనుకోవాలా.? సెన్సార్‌ దగ్గర అవి ‘కట్‌’ అయిపోయాయని అనుకోవాలా.? ఇదో సందిగ్ధ పరిస్థితి.

తాజాగా, ‘దేవి శ్రీ ప్రసాద్‌’ సినిమా వివాదాల్లోకెక్కింది. చిన్న సినిమా.. చిన్న నటీనటులతో చేసిన సినిమా ఇది. ‘శవంతో సెక్స్‌’ ఇదీ సినిమా ప్రమోషన్‌ కోసం వాడిన తొలి టీజర్‌ సారాంశం. దీన్ని బూతు అనలేం.. అంతకు మించిన పేరు ఇంకోటేదన్నా పట్టాలి. పైశాచికత్వం అన్న మాట సరిపోద్దేమో. కానీ, సినిమా యూనిట్‌ మాత్రం ‘బూతు సినిమా కాదు.. అసభ్యకర సన్నివేశాలుండవు..’ అంటూ సినిమా విడుదలకు ముందు పబ్లిసిటీ స్టంట్స్‌ షురూ చేసేశారు.

ఫొటోలు, వీడియోలు చూశాక.. ఇది బూతు కాదు, యూత్‌ ఫిలిం అని చిత్ర యూనిట్‌ చెప్పే మాటల్ని ఎలా నమ్మగలం.? ‘స్వామి రారా’ ఫేం పూజా రామచంద్రన్‌ ఈ సినిమాలో మెయిన్‌ ఎట్రాక్షన్‌.