కొత్త బంగారు లోకం సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన శ్రీకాంత్ అడ్డాల.. మొదటి సినిమా తోనే స్టార్స్ దృష్టిలో పడ్డాడు. రెండవ సినిమాకే మహేష్ బాబు మరియు వెంకటేష్ లను కలిపి భారీ మల్టీ స్టారర్ ను తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నాడు. తనపై ఇద్దరు హీరోలు దిల్ రాజు పెట్టుకున్న నమ్మకంను నిలబెట్టి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును సక్సెస్ చేశాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాల జోరు పెరిగింది అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత ఈయన తెరకెక్కించిన ముకుందా యావరేజ్ గా నిలువగా.. బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
బ్రహ్మోత్సవం సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్న మహేష్ బాబు అభిమానులు సినిమా విడుదల తర్వాత శ్రీకాంత్ అడ్డాలను ట్రోల్ చేశారు. మహేష్ బాబు ఎలా ఈ సినిమాను చేశాడంటూ కొందరు కామెంట్స్ చేశారు. బ్రహ్మోత్సవం విడుదలై దాదాపుగా అయిదు సంవత్సరాలు అవుతుంది. ఈ సమయంలో ఆ సినిమా గురించి చర్చ అనవసరం అన్నట్లుగా శ్రీకాంత్ అడ్డాల తాజా ప్రెస్ మీట్ లో వ్యాఖ్యలు చేశాడు. సినిమా ప్లాప్ ను ఒప్పుకుంటే చిన్న చిన్న తప్పులు జరిగాయని.. వాటి గురించి ఇప్పుడు పోస్ట్ మార్టం ఎందుకు అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో రూపొందిన నారప్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న నారప్ప సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మీడియా ముందుకు వచ్చిన సమయంలో సహజంగానే ఆయకు బ్రహ్మోత్సవం సినిమా తాలూకు ప్రశ్నలు ఎదురు అయ్యాయి. మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఆయన ఇప్పుడు బ్రహ్మోత్సవం గురించిన చర్చ అనవసరం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో బ్రహ్మోత్సవం సినిమా ప్లాప్ ను ఒప్పుకుంటాను అంటూనే సినిమాను స్క్రిప్ట్ ను అనుకున్నట్లుగా తీయలేక పోయామని పేర్కొన్నాడు.
స్క్రిప్ట్ కరెక్ట్ గా లేకపోవడం వల్లే ఎప్పుడైనా సినిమా ప్లాప్ అవుతుంది. ఆ విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. మేము ఏ ఉద్దేశ్యంతో సినిమా ను ప్రారంభిస్తామో మద్యలో కొన్ని కారణాల వల్ల దాన్ని అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు సినిమా నిరాశ పర్చే అవకాశాలు ఉంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. సినిమా విషయంలో నేను మాత్రం ఫెయిల్ అవ్వలేదు అనుకుంటున్నాను అన్నట్లుగా శ్రీకాంత్ అడ్డాల కామెంట్స్ చేశాడు. బ్రహ్మోత్సవం సినిమా తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమా విడుదల అయిన వెంటనే కొత్త సినిమాను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇప్పటికే అన్నాయ్ అంటూ కొత్త సినిమాను ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీకాంత్ అడ్డాల ఆ సినిమాను భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ నిర్మించబోతున్నట్లుగా.. మూడు పార్ట్ లుగా సినిమా వస్తుంది అన్నట్లుగా కూడా ప్రకటించాడు. గుంటూరు నేపథ్యంలో సాగబోతున్న అన్నాయ్ సినిమా ను ఏ హీరోతో శ్రీకాంత్ చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.