భర్తతో హీరోయిన్ బెడ్రూమ్ ఒప్పందం అదేనట!

చాలా పరిణతి చెందిన నిర్ణయం ఇది. చాలా కుటుంబాల్లో కలతలు రేగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి సెల్‌ఫోన్. స్మార్ట్ ఫోన్ రూపం సంతరించుకున్న సెల్‌ఫోన్‌తో ఏర్పడే బంధాలు, బాంధవ్యాలు వివాహమైన జంటల మధ్యన విబేధాలు రేపుతూ ఉండటాన్ని చూస్తుంటాం.

ఫ్రెండ్లీగా చాటింగ్ చేయడం లేనిపోని అనుమానాలను రేపవచ్చు. లేదా లేనిపోని బంధాలకు స్మార్ట్ ఫోన్ చాటింగులు బాటలు వేయవచ్చు. ఓవరాల్ గా స్మార్ట్ ఫోన్ ఒకింత ప్రమాదకారి అని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. సంబంధాలు ఏర్పడటం వరకూ వెళ్లకపోయినా, ఉన్న బంధాల మధ్యన దూరాన్ని పెంచడానికి మాత్రం స్మార్ట్ ఫోన్ కారణమవుతూ ఉంటుంది.

ఇలాంటి స్మార్ట్ ఫోన్ విషయంలోనే కఠినమైన నిర్ణయం తీసుకున్నారట సోనమ్ కపూర్, ఆనంద్ అహూజా. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. పెళ్లి విషయాన్ని ప్రకటించిన ఇంటర్వ్యూలో సోనమ్ ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని చెప్పింది.

వివాహం తర్వాత తామిద్దరం బెడ్రూమ్‌లోకి స్మార్ట్ ఫోన్ తీసుకురాకూడదు.. అనే ఒప్పందాన్ని పెట్టుకున్నట్టుగా సోనమ్ వివరించింది. ఫోన్ వ్యవహారాలన్నీ బెడ్రూమ్ అవతలే తేలిపోవాలని.. పడకగదిలోకి ఫోన్ తీసుకురాకూడదని.. ఇద్దరికీ ఈ నియామం వర్తిస్తుందని సోనమ్ వివరించింది. బెడ్రూమ్‌కు వెళ్లే సమయానికి ఫోన్‌ని హాల్లోనే పడేసి రావడం లేదా బాత్రూమ్‌లో పెట్టేసి రావడం, బయటే చార్జింగ్ పెట్టేసి రావాలని నిర్ణయించుకున్నట్టుగా సోనమ్ వివరించింది.

వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూనే సోనమ్, ఆనంద్‌లు చాలా పరిణతి చెందిన నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. స్మార్ట్‌ఫోన్ రాకతో మనుషుల మధ్యన బంధాలు యాంత్రికం అవుతున్నాయనే అభిప్రాయాల నేపథ్యంలో కూడా వీరి నిర్ణయం ఆసక్తిదాయకమైనదే. అందరూ అనుచరించదగినదే.