హీరో మంచు విష్ణుకు కరోనా పెద్ద చిక్కే తెచ్చి పెట్టింది. తన కుటుంబానికి వచ్చిన కష్టాన్ని చెప్పుకుంటూ దుక్కాన్ని ఆపుకోలేకపోయాడు. తన భార్య వెరోనికాతో పాటు నలుగురు పిల్లలు విదేశాల్లో చిక్కుకున్నారని, విమాన సర్వీసులు రద్దు కావడంతో తిరిగి రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అసలేం జరిగిందంటే…
ఒక ఊరు , ఒక జిల్లా , ఒక రాష్ట్రం కాదు…యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో వివిధ పనులపై వెళ్లిన వాళ్లు ఎక్కడికక్కడ చిక్కుకున్నారు. తిరిగి రాలేక, కుటుంబాలకు దూరమై మానసికంగా తీవ్ర ఆవేదనకు గురవుతున్ఆనరు. ఇలాంటి వేదనే హీరో మంచు విష్ణుకు కూడా ఎదురైంది.
సీఎం జగన్ చిన్నాన్న కూతురు వెరోనికను టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో విష్ణు భార్య వెరోనిక, నలుగురు పిల్లలు విదేశాల్లో ఉండిపోయారు. దీంతో మంచు విష్ణు తల్లడిల్లుతున్నాడు.
ఆ విషయాన్ని విష్ణు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. `వెరోనికాను, పిల్లలను చాలా మిస్సవుతున్నా. నేను ఎందుకు గడ్డం పెంచుతున్నానని చాలా మంది అడుగుతున్నారు. దానికి ఓ కారణముంది. నా భార్య, పిల్లలు వేరే ఊరిలో ఉన్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చిన తర్వాత గడ్డం తీస్తాను. ఏప్రిల్ 14న ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనుమతిస్తారని అనుకుంటున్నాను. గత ఏడేళ్లుగా నేను ఎక్కడికి వెళ్లినా సాయంత్రానికి తిరిగి వచ్చే వాడిని. పిల్లలతో నాకు అటాచ్‌మెంట్ చాలా ఎక్కువ. అందుకే ఇప్పుడు బాగా కష్టంగా, బాధగా ఉంది. మేము అంతా ఒకే దగ్గర క్వారంటైన్‌లో ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేద`ని విష్ణు తన ఆవేదనంతా చెప్పుకున్నాడు.
ఇలా తన ఆవేదన వ్యక్తపరుస్తూ మాట్లాడుతున్న సమయంలో విష్ణు తట్టుకోలేకపోయాడు. ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ స్థితిలో విష్ణును చూసిన ప్రతి ఒక్కరూ సానుభూతి తెలుపుతున్నారు. త్వరలో సమస్య పరిష్కారమై అంతా కలుసుకునే మంచి కాలం వస్తుందని విష్ణుకు నెటిజన్లు ధైర్యం చెప్పారు.