బాలీవుడ్ స్టార్ హీరో.. కిలాడీ అక్షయ్ కుమార్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఖాన్ ల త్రయం రాజ్యమేలుతున్నా బాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకడిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్న ప్రతిభావంతుడు. నటుడిగా కొన్ని దశాబ్ధాల పాటు అజేయమైన ప్రయాణం కొనసాగింది. ఎలాంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేయగల నటుడిగా సత్తా చాటాడు కిలాడీ కుమార్. మాస్.. క్లాస్… కామెడీ…యాక్షన్… ఏ జోనర్ అయినా కిలాడీ కి కొట్టిన పిండి. ఎలాంటి పాత్రలోకైనా అవలీలగా పరకాయప్రవేశం చేయగల దిగ్గజ నటుడిగా నిరూపించారు. అందుకే కెరీర్ లో 150వ సినిమా మైలు రాయికి అతి చేరువలో ఉన్నారు. గత ఐదేళ్లలో అక్షయ్ కి ఒక్క ఫెయిల్యూర్ చిత్రం కూడా లేదు. ఇక సినిమాల పరంగా ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో బిజీగానే ఉంటారు. ఖాళీ అనే మాట ఆయన డిక్షనరీలో ఎక్కడా కనిపించదు. పాత్ర ఎలాంటిదైనా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం అక్షయ్ లో మరో ప్రత్యేకత.
1987 లో సినిమా కెరీర్ ప్రారంభించిన అక్షయ్ ఇప్పటి వరకూ 146 సినిమాల్లో నటించారు. మరో రెండు.. మూడు చిత్రాలు రిలీజ్ కు లైన్ లో ఉన్నాయి. 150 సినిమాలు పూర్తి చేసి ల్యాండ్ మార్క్ నటుడిగా ఖ్యాతి కెక్కాలని వెయిట్ చేస్తున్నారు. తన 150వ చిత్రం తన కెరీర్ లో నే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. నటుడిగా తనని మరో మెట్టు పైకి ఎక్కించే విధంగా ఈ సినిమా ఉండాలని పక్కా ప్రణాళికతో ఉన్నారు అక్షయ. దీనికి సంబంధించి అప్పుడే కసరత్తులు మొదలు పెట్టినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటించిన `బెల్ బాటమ్`.. `సూర్యవంశీ` చిత్రాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఆగస్టు 19న బెల్ బాటమ్ రిలీజ్ అవుతుంది. ఇంకా అక్షయ్ లిస్ట్ లో `బచ్చన్ పాండే`.. `పృథ్వీరాజ్`..` ఆత్రంగీ రే`.. `రామ్ సేతు`.. `రక్షా బంధన్`.. `మిషన్ సిండ్రెల్లా` పార్ట్-1 చిత్రాలున్నాయి. ఇలా ఎన్ని ఉన్నా 150 మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. దానికి సంబంధించి స్పెషల్ ప్లాన్ ఒకటి అక్షయ్ దగ్గర ఉందన్నది బాలీవుడ్ వర్గాల టాక్. ఇక సౌత్ లో డా.దాసరి నారాయణరావు దర్శకనిర్మాతగా నటుడిగా 150 సినిమాల రికార్డును కలిగి ఉన్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాల రికార్డుతో వెలిగిపోతున్నారు. ఇప్పుడు ఇదే కేటగిరీలో కిలాడీ అక్షయ్ కుమార్ చేరుతుండడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.