మరొక సర్వేకు పురమాయిస్తున్న కేసీఆర్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సర్వేలు చేయించడం, ఆయా సర్వేఫలితాల మీద ఆధారపడి తమ వ్యూహాలను తయారు చేసుకోవడంలో ఇటీవలి కాలంలో బాగా పేరుపడ్డారు. ఆయన తాను సర్వే చేయించిన ప్రతిసారీ.. అదిపనిగా విలేకర్ల సమావేశం నిర్వహించి… తెలంగాణలో (అప్పటికి ఉన్న రాజకీయ పరిస్థితుల్లో) ఏయే పార్టీలు ఎన్నెన్ని సీట్లు గెలవబోతున్నాయో చాలా విపులంగా లెక్కలు చెప్పేవాళ్లు.. ఆ రకంగా తెరాస వందసీట్లకు పైగా సునాయాసంగా గెలుపొందుతుందని, కాంగ్రెస్ కు పరిమిత సంఖ్యలోనే సీట్లు వస్తాయని, తెదేపా పని అయిపోయినట్లేనని ఆయన వేర్వేరు సందర్భాల్లో ఎన్నికల జోస్యం చెప్పిఉన్నారు.

అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ మరొకసారి సర్వే చేయించడానికి ఉద్యుక్తులు అవుతున్నట్లుగా తెలుస్తోంది. తనకు అత్యంత విశ్వసనీయమైన సర్వే సంస్థ ద్వారా రేవంత్ అండ్ కో కాంగ్రెస్ లో చేరికల అనంతరం మారగల పరిస్జితులు… ఆ తర్వాత ప్రజాబలం ఎప్పటికి ఎలా ఉంటుందో బేరీజు వేసి చెప్పవలసిందిగా సర్వేసంస్థను పురమాయించినట్లుగా తెలుస్తోంది.

రేవంత్ అంటున్నట్లుగా.. ఆయన కాంగ్రెసులో చేరడం అనేది రాజకీయ శక్తుల పునరరేకీకరణ గానే జరుగుతోంది. రేవంత్ తో పాటూ పలువురు నేతలు కాంగ్రెసులో చేరారు. ఇంకా అనేక మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు కూడా ప్రజల్లో ఈ చేరికల ప్రభావాన్ని అంచనా వేయడం తొందరపాటు అవుతుందని, కనీసం మరొక నెల గడిచిన తర్వాత.. తెలంగాణలో రాహుల్ సభ కూడా పూర్తయిన తరువాత… తెలంగాణలో ఇతర పార్టీలనుంచి కూడా కాంగ్రెసులోకి వలసల పర్వం పూర్తయిన తర్వాత… ఎవరి ప్రభావం ఎలా ఉంటుందో.. సర్వే చేయించాలని సీఎం అనుకుంటున్నారుట.

సర్వేలకు కొత్తగా సిద్ధం అవుతున్నంత మాత్రాన… కేసీఆర్ , మారుతున్న పరిణామాలను చూసి భయపడుతున్నట్లు కాదని, చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలనే వ్యూహంతోనే, శత్రుబలాన్ని ఉపేక్ష భావంతో చూస్తే నష్టం జరుగుతుందనే భావనతోనే ఈ అంచనాలు సాగిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.